తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Podu Lands : పోడు భూములు అంటే ఏంటి? ఎన్ని ఎకరాలు ఉన్నాయి?

Telangana Podu Lands : పోడు భూములు అంటే ఏంటి? ఎన్ని ఎకరాలు ఉన్నాయి?

Anand Sai HT Telugu

24 November 2022, 23:59 IST

google News
    • Podu Lands In Telangana : ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ హత్యపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. పోడు భూముల వ్యవహారంలోనే ఈ ఘటన జరిగింది. ఇంతకీ పోడు భూములు అంటే ఏంటి? తెలంగాణలో ఈ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి?
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పోడు భూముల(Podu Lands) వ్యవహారంలో చాలా ఘటనలు జరిగాయి. ఫారెస్ట్ అధికారి శీనివాస్ హత్యతో మరోసారి పోడుభూములపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ(Assembly)లో కేసీఆర్ చేసిన ప్రకటనను గుర్తు చేస్తున్నారు. ఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తున్నామని.. ఆదివాసులు హక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వాదన వేరేలాగా ఉంది. తెలంగాణ(Telangana)లో ఎంత పోడు భూమి ఉందనేది ఇప్పుడు చర్చకు వస్తోంది.

కొంతమేర అడవిని కొట్టి.. వివిధ రకాలు పంటలు పండించుకుంటారు. ఇవే కొంతమందికి ప్రధాన జీవనాధారం. అడవులు, కొండ వాలుల్లో చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయంగా పిలుస్తారు. సాంప్రదాయబద్దంగా చేసుకునే పోడు భూములపై తెలంగాణ(Telangana) రాష్ట్రంలో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. అయితే ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వీటికి హక్కులు కల్పించాలని చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది.

పోడు భూములపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటన చేశారు. తానే బయల్దేరతానని.. అన్ని చోట్లకూ స్వయంగా పోతానని చెప్పారు. మంత్రివర్గం, అధికార గణం అందర్నీ తీసుకెళ్లి.. ప్రజా దర్బారు పెట్టి పోడు పట్టాలు ఇచ్చేస్తామన్నారు. ఆ తర్వాత ఒక ఇంచు కూడా ఆక్రమణ కానివ్వమని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఇంకా పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు.

తెలంగాణ(Telangana)లోని సుమారు 11 జిల్లాల్లో పోడు భూములు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. మిగతా జిల్లాల్లోనూ పోడు వ్యవసాయం(Podu Cultivation) చేస్తున్న వారు ఉన్నారు. కొన్నేళ్లుగా గిరిజన రైతులు సాగు చేకుకుంటున్నారు. హరితహారం పథకంతో అటవీ భూముల్లో ప్రభుత్వం మెుక్కల పెంపకం చేపడుతోంది. దీంతో అటవీ(Forest) అధికారులు, పోడు వ్యవసాయం చేసే రైతులకు మధ్య వివాదం నడుస్తోంది. భూ హక్కు పత్రాలు ఉన్న భూములను వదిలేసి.. మిగతా ప్రాంతాల్లో మెుక్కలు నాటుతామని అధికారులు చెబుతున్నారు. తాము పోడు చేసుకుంటున్న భూముల్లో మెుక్కలు నాటుతున్నారని గిరిజనులు అంటున్నారు.

రాష్ట్రంలో 28 జిల్లాల నుంచి రెండు వేల 845 గ్రామ పంచాయతీల నుంచి 4 లక్షల 14వేల 353 దరఖాస్తుల వరకూ ప్రభుత్వానికి వచ్చాయి. ఆ భూమి చూసుకుంటే.. 12లక్షల 46వేల 846 ఎకరాలుగా ఉంది. ఆ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కసరత్తు నడుస్తోంది. పోడు(Podu) సమస్యను పరిష్కరించి 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

నిజానికి అటవీ, పోడు భూముల హక్కుల కోసం ప్రత్యేకంగా ఓ చట్టం కూడా వచ్చింది. అటవీ హక్కుల చట్టం 2006ను తీసుకొచ్చారు. దీని ప్రకారం హక్కులు కల్పించాల్సి ఉంది. అటవీ భూములను క్లెయిమ్ చేస్తూ ఇప్పటికే చాలా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2005కి ముందు వాటికే అంటే.. లక్షా 60 వేల ఎకరాలు మాత్రమే హక్కులు కల్పించేందుకు అర్హత ఉంది. అయితే ఇందులోనూ చాలావరకు పత్రాలను అప్పట్లో అధికారులు తిరస్కరించారు. 2005 తర్వాత ఇంకా కొన్ని లక్షల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.

2006లో అమల్లోకి వచ్చిన అటవీ చట్టం మాత్రం.. అలాంటి భూములకు హక్కులు కల్పించేందుకు అవకాశం లేదని చెబుతోంది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం 2005 డిసెంబర్‌ 13 కంటే ముందు అటవీ భూములను(Forest Lands) సాగు చేస్తున్న గిరిజనులందరికీ భూమిపై హక్కు కల్పిస్తూ పత్రాలివ్వాలి. గరిష్ఠంగా నాలుగు హెక్టర్లు మాత్రమే సాగుచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఆక్రమణకు గురైన భూముల్లో అటవీ శాఖ మెుక్కలు నాటుతోంది. ఇక్కడి నుంచే కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది.

ఈ పోడు భూముల విషయంపై ఎప్పటి నుంచో ఓ చర్చ కూడా ఉంది. గిరిజనులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఆక్రమణలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దఎత్తున ఇలాంటి ఆక్రమణలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓ వైపు దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో పోడు భూముల పరిష్కారం దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అయితే ఎంతమందికి ఇస్తారు? అనేది ఆసక్తికరంగా మారనుంది

మరోవైపు 1/70 చట్టంపైనా ఇప్పుడు చర్చ నడుస్తోంది. అడవుల్లో ఆదివాసులకే ఆస్తి హక్కు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి 1/70 చట్టాన్ని తెచ్చింది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, అంతరించి పోతున్న తెగలను కాపాడలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే కొంతమంది అక్రమార్కులు మాత్రం ఈ చట్టాన్ని పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. యథేచ్చంగా భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయనే విమర్శ ఉంది.

తదుపరి వ్యాసం