Sangareddy Suicide: ప్రియురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి దొరికిపోయి, చివరకు ఆత్మహత్య..
29 October 2024, 9:37 IST
- Sangareddy Suicide: ప్రియురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి దొరికిపోయిన యువకుడు అవమాన భారం తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్న యువకుడు యువతి బంధువులు దాడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకున్న యువకుడు
Sangareddy Suicide: వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.ప్రియురాలి పుట్టినరోజు కావడంతో రాత్రి శుభాకాంక్షలు చెప్పడానికి ఆమె వద్దకు వెళ్ళాడు. అది గమనించిన యువతీ కుటుంబసభ్యులు అతనిని పట్టుకొని చితకబాదారు. అవమానభారంతో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే
కళాశాలలో పరిచయం ....
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మాలపహాడ్ గ్రామానికి చెందిన మల్లగొని గొల్ల శంకరయ్య కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయన పెద్ద కుమారుడు రంజిత్ (19) పుల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం (CEC) చదువుతున్నాడు.
అదే కళాశాలలో పుల్కల్ కు చెందిన వడ్డె నరసింహులు కూతురు రేణుక కూడా చదువుతుంది. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వారి కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ....
ఆదివారం నాడు తన పుట్టినరోజు ఉందని రంజిత్ కు రేణుక ఫోన్లో చెప్పింది. నువ్వు కచ్చితంగా వచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలని కోరింది. దీంతో రంజిత్ ఒంటరిగా తన ఎక్సెల్ వాహనంపై పుల్కల్ ఆదివారం రాత్రి గ్రామానికి వెళ్లాడు. ప్రేమికురాలితో మాట్లాడుతుండగా రంజిత్ ను గమనించిన రేణుక కుటుంబసభ్యులు కోపంతో అతనిని పట్టుకొని తీవ్రంగా కొట్టారు.
ఆ తర్వాత రంజిత్ మాలపాడ్ గ్రామంలోని తన మిత్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే రంజిత్ స్నేహితులు పుల్కల్ గ్రామానికి వెళ్లి యువతీ కుటుంబ సభ్యులతో మాట్లాడి అర్ధరాత్రి అతనిని ఇంట్లో దింపి వెళ్లిపోయారు.
చెరువులో దూకి ఆత్మహత్య ....
దీంతో మనస్థాపం చెందిన రంజిత్ అవమానభారంతో గ్రామం సమీపంలోని కుమ్మరి చెరువు వద్దకు వెళ్ళాడు. అక్కడ చెరువు ఒడ్డున మొబైల్ ఫోను, తన ద్విచక్ర వాహన తాళం చెవిని పెట్టి కుమ్మరి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు ద్విచక్ర వాహనాన్ని గమనించి రంజిత్ తండ్రి శంకరయ్యకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాల్ల సహాయంతో చెరువులో వెతకడం మొదలుపెట్టారు. అనంతరం మూడు గంటల తర్వాత మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసి రంజిత్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అనంతరం ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. తన కొడుకు మృతికి పుల్కల్ కు చెందిన వడ్డెర నరసింహులు కుమార్తె రేణుకనే కారణమని మృతుడు తండ్రి శంకరయ్య ఆరోపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సదాశివపేట పోలీసులు తెలిపారు.