తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Accident: సంగారెడ్డిలో పెళ్లింట విషాదం, ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం

Sangareddy Accident: సంగారెడ్డిలో పెళ్లింట విషాదం, ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం

HT Telugu Desk HT Telugu

28 March 2024, 11:24 IST

google News
    • Sangareddy Accident: వధువును తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి  ముగ్గురు మృతి చెందడంతో పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. 
మాన్సాన్‌పల్లిలో బోల్తా పడిన ట్రాక్టర్
మాన్సాన్‌పల్లిలో బోల్తా పడిన ట్రాక్టర్

మాన్సాన్‌పల్లిలో బోల్తా పడిన ట్రాక్టర్

Sangareddy Accident: వధువును తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ Tractor బోల్తా పడి ముగ్గురు మృతి చెందడంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరి కొన్ని గంటల్లో పెళ్ళి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పెళ్లి కూతురిని Bride తీసుకు రావడానికి 30 మంది బంధువులతో కలిసి ఆనందంగా ట్రాక్టర్ లో బయలుదేరారు. మరికాసేపట్లో పెళ్ళి కూతురి ఇంటికి చేరుకుంటామనే లోపు ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడడంతో ముగ్గురు మృతి చెందారు. 27 మంది క్షతగాత్రులయ్యారు.

ఈ ప్రమాదంతో అప్పటి వరకు బంధువులతో కళకళలాడిన ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటన సంగారెడ్డి Sangareddy జిల్లా మాన్సాన్ పల్లి శివారులో బుధవారం సాయంత్రం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేష్‌కు, సంగారెడ్డి జిల్లా అందోల్ కు చెందిన మమతతో పెళ్లి నిశ్చయమైంది.

గురువారం బాచారంలో పెళ్లి జరగాల్సి ఉండగా,పెళ్లి కొడుకు బంధువులు 30 మంది కలిసి పెళ్లి కుమార్తెను తీసుకెళ్లడానికి బుధవారం సాయంత్రం ట్రాక్టర్లో అందోల్ కు బయల్దేరారు.

పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అందోల్ మండలం మాన్సాన్ పల్లి శివారులోకి రాగానే మూలమలుపు వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో బుదెమ్మ (50), జెట్టిగారి సంగమ్మ (45),ఆగమ్మ (48) మృతిచెందారు.

ఉరేసుకున్న వరుడి తాత…

ట్రాక్టర్‌ బోల్తా పడి 27 మంది గాయపడ్డారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్వల్పంగా గాయపడిన వారిని అందోల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తీవ్రగాయాలైన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా వెళ్లడం వలన ఈప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు.

ప్రమాదం జరగడంతో మనుమడి పెళ్లి ఆగిందన్న మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . దీంతో బాచారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు...

బంధువుల అంత్యక్రియలకు బైక్ మీద వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరన్నగూడెం రాడ్ రోలింగ్ పరిశ్రమ సమీపంలో జరిగింది.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్ పల్లి గ్రామానికి చెందిన పడమటి లక్ష్మణ్ (25) బంధువుల అంత్యక్రియలకు గుమ్మడిదలకు బైక్ ఫై వెళ్ళాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వీరన్నగూడెం రాడ్ రోలింగ్ పరిశ్రమ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న డిసిఎం బైక్ ను ఢీకొట్టింది.

ప్రమాదంలో లక్ష్మణ్ కు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం