తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Accidents: వరుస ప్రమాదాలతో హడలెత్తిస్తున్న వరంగల్–కరీంనగర్​ హైవే

Warangal Accidents: వరుస ప్రమాదాలతో హడలెత్తిస్తున్న వరంగల్–కరీంనగర్​ హైవే

HT Telugu Desk HT Telugu

27 December 2023, 6:03 IST

google News
    • Warangal Accidents: నేషనల్​ హైవే–563లో భాగమైన వరంగల్–కరీంనగర్​ రహదారి హడలెత్తిస్తోంది. వరంగల్ నుంచి హుజురాబాద్​ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో జనాలు ఈ రోడ్డంటేనే బెంబేలెత్తి పోతున్నారు.
వరంగల్‌ హైవేపైతరచూ రోడ్డు ప్రమాదాలు
వరంగల్‌ హైవేపైతరచూ రోడ్డు ప్రమాదాలు

వరంగల్‌ హైవేపైతరచూ రోడ్డు ప్రమాదాలు

Warangal Accidents: ఐదు రోజుల్లో వరంగల్‌-హుజురాబాద్‌ మార్గంలో నాలుగు ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివిధ కారణాలతో ఈ ప్రమాదాలు జరగగా ఇప్పుడు ఆ మార్గంలో రాకపోకలు సాగించాలంటేనే జనాలు జంకుతున్నారు.

ఇటీవల కాలంలో వరంగల్ కమిషనరేట్​ లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. కమిషనరేట్​ లో సగటున రోజుకు నాలుగు రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతుండగా.. ఒకరు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఐదురోజుల్లో ఏడుగురు బలి

గడిచిన ఐదు రోజుల్లో వరంగల్–కరీంనగర్​ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాలు గగుర్పాటును కలిగిస్తున్నాయి. ఈ నెల 22న వరంగల్–కరీంనగర్​ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనం కోసం ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన అన్నదమ్ముల రెండు ఫ్యామిలీలకు చెందిన ఏడుగురు ఒకే కారులో వెళ్తుండగా.. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

24వ తేదీన హుజురాబాద్​ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హుజురాబాద్​ నుంచి హనుమకొండ వెళ్తున్న అద్దె బస్సు రన్నింగ్​ లోనే వెనక ఎడమవైపు ఉన్న రెండు టైర్లు ఊడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది వరకు ఉండగా.. తృటిలో పెను ముప్పు తప్పింది. అనుకోని సంఘటన ఏదైనా జరిగి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది.

ఇక సోమవారం ఇదే ఎల్కతుర్తి ప్రాంతంలో మరో ఘటన కూడా జరిగింది. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన 10 మంది టాటా మ్యాజిక్​ వెహికిల్​ లో వేములవాడ వెళ్తుండగా ఎల్కతుర్తి వద్దకు రాగానే స్టీరింగ్​ రాడ్డు విరిగి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఎనిమిది స్వల్పంగా గాయపడ్డారు.

మంగళవారం బావుపేట క్రాస్​ వద్ద జరిగిన ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల ప్రాణాలను బలిగొంది. బంధువు అంత్యక్రియల నిమిత్తం స్కూటీ మీద బావుపేటకు వెళ్లి వస్తున్న ధర్మసాగర్​ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇలా గడిచిన ఐదురోజుల్లోనే నాలుగు ప్రమాదాలు జరిగి.. ఏడుగురు మృత్యువాత పడటంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

డేంజర్​ జోన్​ గా ఎల్కతుర్తి ఏరియా

వరుస ప్రమాదాలతో వరంగల్​–కరీంనగర్​ జాతీయ రహదారి రక్తమోడుతోంది. కాగా ఈ మార్గంలో ఇటీవల జరిగిన ప్రమాదాలన్నీ ఎల్కతుర్తి మండల కేంద్రానికి చుట్టుపక్కలనే జరిగాయి. దీంతో ఎల్కతుర్తి ఏరియాను డేంజర్​ జోన్​ గా భావిస్తున్నారు.

చాలావరకు వాహనాల ఓవర్​ స్పీడ్​ ప్రమాదాలకు కారణమవుతుండగా.. కొన్ని సందర్భాల్లో స్వీయ తప్పిదాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. వరంగల్ నుంచి హుజురాబాద్​ వరకు చాలాచోట్లా బ్లైండ్​ కర్వ్స్​ కూడా ఉన్నాయి. ప్రమాదకర మూలమలుపులతో పాటు వాహన డ్రైవర్ల నిద్రమత్తు, అతివేగం ప్రాణాలను హరిస్తోందనే విషయం స్పష్టమవుతోంది.

కమిషనరేట్ లో ఈ ఏడాది 487 మరణాలు

వరంగల్ కమిషనరేట్​ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. 2021లో కమిషనరేట్​ వ్యాప్తంగా 1,180 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 460 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,142 మంది గాయాల పాలయ్యారు. 2022 సంవత్సరంలో 1,149 యాక్సిడెంట్లు జరిగాయి. ఆయా ప్రమాదాల్లో 438 మంది మృత్యువాత పడ్డారు. మరో 1,118 మంది క్షత గాత్రులయ్యారు.

ఈ సంవత్సరం ఇదివరతో పోలిస్తే యాక్సిడెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. ఈ ఏడాది మొత్తంగా 1,526 రోడ్డు ప్రమాదాలు జరగగా.. ఏకంగా 487 మంది రోడ్డుకు బలయ్యారు. మరో 1,361 మంది గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. కాగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది యాక్సిడెంట్లు 32.8 శాతం పెరిగిపోగా.. మరణాలు 11.18 శాతం, క్షతగాత్రుల సంఖ్య 21.73 శాతం ఎక్కువగా నమోదు అయ్యింది.

ఇలా ఏటికేడు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుండగా.. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాల్సిన నేషనల్​ హైవే, ఆర్​ అండ్​ బీ, ఆర్టీఏ, పోలీస్​ అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అన్ని విభాగాల అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

​(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం