తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal News : గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ గురి, అవిశ్వాసం వైపు అడుగులు

Warangal News : గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ గురి, అవిశ్వాసం వైపు అడుగులు

HT Telugu Desk HT Telugu

03 January 2024, 22:23 IST

google News
    • Warangal News : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వరంగల్
వరంగల్

వరంగల్

Warangal News : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటుపై కాంగ్రెస్ పార్టీ కన్నేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు అడుగులు పడుతుండగా.. రాష్ట్రంలో కీలకమైన గ్రేటర్ మేయర్ సీటుపై కాంగ్రెస్ జెండాను ఎత్తాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ, ప్రస్తుత కార్పొరేటర్లు ఎనిమిది మంది బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ ను గట్టి దెబ్బకొట్టారు. ఒకేసారి దాదాపు ఎనిమిది మంది మాజీ, ప్రస్తుత కార్పొరేటర్లు పార్టీకి దూరమవడం, మరికొంతమంది కూడా అదే ప్లాన్ లో ఉండటంతో గ్రేటర్ బీఆర్ఎస్ ముఖ్య నేతల్లోనూ కలవరం మొదలైంది. ముఖ్యంగా మేయర్ గుండు సుధారాణికి టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన సమీకరణాలు

2021 ఎన్నికల సమయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో డీలిమిటేషన్ చేపట్టి 66 డివిజన్లను ఏర్పాటు చేశారు. కాగా ఇందులో బీఆర్ఎస్ పార్టీ 48, బీజేపీ 10, కాంగ్రెస్ పార్టీ 4, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు, జంపింగ్ల వల్ల బీఆర్ఎస్ బలం 53కు చేరగా.. బీజేపీ 9, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక మేయర్ స్థానం బీసీ రిజర్వ్ కావడంతో అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చక్రం తిప్పగా.. 29వ డివిజన్ నుంచి బరిలో నిలిచిన గుండు సుధారాణికి మేయర్ పదవి దక్కింది. కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత గ్రేటర్ వరంగల్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు చక్రం తిప్పి కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఎగరేసుకెళ్లారు. దీంతో ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో పడి.. బీఆర్ఎస్ చిత్తుగా ఓడింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొండా సురేఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కొద్దిరోజుల పాటు ఇక్కడ వాతావరణం కాస్త స్తబ్ధుగా మారింది.

రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక

కొద్దిరోజుల పాటు వరంగల్ నగరంలో రాజకీయాలు కాస్త సైలెంట్ కాగా.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు టచ్ లోకి కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తెరవెనుక తతంగం నడిపి మాజీ, ప్రస్తుత కార్పొరేటర్లను కాంగ్రెస్ గూటికి చేర్చారు. ఇందులో ప్రస్తుత కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, నెక్కొండ కవితకిషన్, చీకటి శారద ఆనంద్, మామిండ్ల రాజు, ఏనుగుల మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్, వేల్పుల మెహన్ రావు తదితరులు ఉండగా.. వారంతా బుధవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

మేయర్ పీఠంపై గురి

వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన మాజీ, ప్రస్తుత కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరగా.. మరికొద్దిరోజుల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల ముందు పావులు కదిపి సక్సెస్ అయిన కొండా మురళితో ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. వారందరితో కొండా మురళి చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఉద్దేశంతోనే గంపగుత్తగా అందరూ కాంగ్రెస్ లోకి చేరేందుకు కొండా మురళిని సంప్రదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొండా దంపతులు వారితో చర్చలు జరుపుతుండగా.. ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తతంగం అంతా పూర్తయిన తరువాత కాంగ్రెస్ బలాన్ని బేరీజు వేసుకుని, మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

గుండు సుధారాణికి టెన్షన్

క్రమంగా బలాన్ని పెంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి మేయర్ గా ఎన్నికైన తరువాత మూడేళ్ల వరకు అవిశ్వాసం చెల్లదనే నిబంధనలు ఉన్నాయి. కాగా గ్రేటర్ వరంగల్ పాలకవర్గం ఏర్పడి వచ్చే మే నెలతో మూడేళ్లు పూర్తికానున్నాయి. మూడేళ్లు పూర్తిగా నిండిన తరువాత అంతా సవ్యంగా ఉంటే మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ తరువాత కొండా దంపతులతో పాటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ఆమోదయోగ్యమైన వ్యక్తిని మేయర్ గా ఎన్నుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ ను ఖాళీ చేయించి కాంగ్రెస్ బలాన్ని పెంచుకునే దిశలో హస్తం పార్టీ నేతలు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తరువాత గ్రేటర్ వరంగల్ లో కీలక మార్పులెన్నో రాగా.. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం