Narsampet BJP : నర్సంపేట బీజేపీలో భగ్గుమన్న వర్గపోరు- పార్టీ ఆఫీస్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం
06 July 2023, 20:01 IST
- Narsampet BJP :నర్సంపేట బీజేపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీలో తమకు సరైన గుర్తింపు లేదని ఓ వర్గం నేతలు ఏకంగా పార్టీ ఆఫీసుపైనే దాడి చేశారు.
నర్సంపేట బీజేపీ ఆఫీసుపై దాడి
Narsampet BJP :వరంగల్ జిల్లా నర్సంపేట బీజేపీ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. బీజేపీ నేత రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు.. పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలో దాడి జరిగింది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని పర్యటన వేళ
తెలంగాణలో బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి వరకూ రాష్ట్ర నేతలు కుమ్ములాడుకుంటే...ఇవాళ గల్లీ నేతలు దాడులకు దిగారు. కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య వర్గపోరు మొదలైంది. రెండు రోజుల్లో వరంగల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన వేళ నర్సంపేట బీజేపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఓ వర్గం నేతలు బీజేపీ ఆఫీసుపైనే దాడికి దిగడం సంచలనంగా మారింది. తమకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొందరు నేతలు పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ దాడి జరిగింది. ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు ముందే నర్సంపేట బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. నర్సంపేట పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి పార్టీ కార్యాలయంపై దాడి చేశాయి. ఈ ఘటన తర్వాత ఒక వర్గంపై మరో వర్గం నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.