తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Crime : వరంగల్ బల్దియాలో భారీ స్కామ్, సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లు కొట్టేసిన ఉద్యోగి

Warangal Crime : వరంగల్ బల్దియాలో భారీ స్కామ్, సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లు కొట్టేసిన ఉద్యోగి

HT Telugu Desk HT Telugu

31 October 2023, 18:22 IST

google News
    • Warangal Crime : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ స్కామ్ వెలుగుచూసింది. కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి రూ.2.31 కోట్లు కొట్టేశాడు ఓ ఉద్యోగి. ఈ స్కామ్ లో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్

Warangal Crime : గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​కార్పొరేషన్​లో ఇటీవల బయటపడిన భారీ స్కామ్ మలుపులు తిరుగుతోంది. గతంలో ఇక్కడ కమిషనర్​ గా పనిచేసిన పమేలా సత్పతి సంతకాలను ఫోర్జరీ చేసి ఓ ఉద్యోగి దాదాపు రూ.2.31 కోట్లు కొల్లగొట్టగా.. ఈ బాగోతంపై విచారణ జరుగుతోంది. కేవలం ఒక్క ఉద్యోగే ఇదంతా చేశాడని మొదట భావించినా.. పోలీసుల విచారణలో ఇతర ఉద్యోగుల పేర్లు బయటపడుతున్నాయి. దీంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​ లో టెన్షన్​వాతావరణం నెలకొంది. కాగా పోలీసుల విచారణలో ఇంకెంతమంది బయటపడతారోననే చర్చ జరుగుతోంది.

అసలేం జరిగింది?

2021లో గ్రేటర్​వరంగల్‌ కమిషనర్ గా పమేలా సత్పతి పనిచేసిన సమయంలో క్యాంప్​ క్లర్క్(సీసీ)గా బండా అన్వేశ్​విధులు నిర్వర్తించాడు. స్మార్ట్​సిటీ కన్సల్టెన్సీలకు చెల్లింపులు, డీపీఆర్, ఇతర టెండర్లకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, కమిషనర్​సంతకం ఫోర్జరీ చేసి దాదాపు రూ.2.31 కోట్లు కొల్లగొట్టాడు. వాటిని గతంలో ఇక్కడ పనిచేసిన సీనియర్​అసిస్టెంట్​ఉమాకాంత్, ప్రీ ఆడిట్ విభాగంలో పనిచేసే మరో సీనియర్​అసిస్టెంట్​జన్నం సతీశ్​సహాయంతో సొమ్మునంతా కాజేశాడు. అనంతరం తన స్నేహితులు, కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి డబ్బులు మళ్లించి, ఆ తరువాత వాటిని డ్రా చేశాడు. కాగా ఓ ఫైల్​విషయంలో మోసాన్ని పసిగట్టిన అప్పటి కమిషనర్ పమేలా సత్పతి 2021లోనే కిందిస్థాయి ఆఫీసర్లను ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆదేశించారు. కానీ గ్రేటర్​ ఎన్నికలు, ఆ తరువాత వివిధ కారణాల వల్ల రెండేండ్ల పాటు అంతర్గత విచారణ జరిగింది.

సీసీ అన్వేశ్​ మోసం చేసినట్లు నిర్ధారణ జరిగినా.. ఈ విషయాన్ని కొందరు అధికారులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే పమేలా సత్పతి ఇక్కడి నుంచి బదిలీ అయి సీడీఎంఏగా బాధ్యతలు స్వీకరించగా.. తన సంతకం ఫోర్జరీ చేసి, నిధులు దుర్వినియోగం చేయడాన్ని సీరియస్​గా తీసుకుని విచారణను ముమ్మరం చేయించారు. దీంతో అసలు బాగోతం బయటపడగా.. రూ.2,31,91,076 సొమ్మును అన్వేశ్​ మళ్లించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఇటీవల సీసీ అన్వేశ్​ను సస్పెండ్​చేసి వరంగల్ మట్వాడా పోలీస్​స్టేషన్ లో కేసుపెట్టారు.

తవ్వే కొద్ది బయటపడుతున్న బాగోతం

బల్దియాలో సీసీ అన్వేశ్​పదేండ్లుగా పనిచేస్తున్నాడు. నిధుల మళ్లింపు విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఒక్కడే స్వాహా చేశాడా అనే కోణాల్లో విచారించారు. దీంతో బయటపడిన విషయాలతో పోలీసులే షాక్​అయ్యారు. జీడబ్ల్యూఎంసీ అకౌంట్స్​వింగ్​లో పని చేసే ఉద్యోగితో పాటు ప్రీ ఆడిట్​విభాగంలోని మరో ఉద్యోగి కూడా ఆయనకు సహకరించినట్లు ప్రాథమికంగా గుర్తించి, వారినీ పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఈ మేరకు అన్వేశ్​ఫ్రాడ్​కు సహకరించిన గతంలో ఇక్కడ పనిచేసిన సీనియర్​అసిస్టెంట్​ఉమాకాంత్​ను ఇదివరకే అరెస్ట్​చేశారు. అనంతరం లోతైన దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో నిందితుడు ప్రీ ఆడిట్​వింగ్ లో పనిచేసే సతీశ్​పేరు కూడా బయటపడింది. దీంతో ఆయనను సోమవారం అరెస్ట్​ చేశారు. కేవలం వీరి ముగ్గురితోనే అయిపోతుందనుకుంటే విచారణలో మరో ఆరుగురు కూడా అన్వేశ్​కు సహకరించినట్లు తేలింది.

ఆరుగురి అకౌంట్లలోకి డబ్బులు

సంతకాలు ఫోర్జరీ, నకిలీ బిల్లులు తయారు చేసి కాజేసిన సొమ్మును అన్వేశ్​ తన స్నేహితులు, కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. మొత్తం ఆరుగురి అకౌంట్లలోకి డబ్బును మళ్లించి, ఆ తరువాత డ్రా చేసుకునేవాళ్లని పోలీసులు తెలిపారు. కాగా అన్వేశ్​స్నేహితులు నరేశ్, పునేందర్, సాయికృష్ణ, రమణాచారి, అన్వేశ్​ చెల్లెల్లు వీణ, జ్యోత్స్న ఖాతాల్లో జమ చేసేవాళ్లని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు వారిని కూడా సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. కాగా కమిషనర్​సంతకం ఫోర్జరీ చేసి, నకిలీ దస్త్రాలతో బిల్లులు కాజేసిన కేసులో ఇప్పటికి మొత్తం 9 మంది అరెస్ట్ కాగా.. పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. దీంతో బల్దియాలో పనిచేసే మిగతా ఉద్యోగుల్లో కూడా టెన్షన్​కనిపిస్తోంది. కాగా ఇంకా ఎంతమంది ఈ స్కామ్ లో పాలుపంచుకున్నారో పూర్తి విచారణలో బయటపడే అవకాశం ఉంది.

(రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం