Warangal News : పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం- దాస్యం వినయ్ భాస్కర్
28 October 2023, 7:21 IST
- Warangal News : బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈసారి 50 వేలకు పైగా మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వినోద్ కుమార్, దాస్యం వియన్ భాస్కర్
Warangal News : సీఎం కేసీఆర్ తనను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషకరమని, ప్రజలు కూడా అలాగే ఆదరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏ వాడకెళ్లినా తనను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నారు. ప్రతిచోట లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎందరో ఉన్నారని, పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందిస్తున్నామన్నారు. ఏ వృత్తిలో ఉన్న వారి కైనా, వివిధ రకాల పెన్షన్ల వారికైనా అనేక అభివృద్ధి ఫలాలు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. ప్రతి చోటా ఆత్మీయంగా పలకరించి వారి ఇంట్లో మనిషిగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని, వేరే ఏ పార్టీ వచ్చినా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. 2009 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ నమ్మకంగా వారికి తోడుగా పనిచేస్తున్నానన్నారు. గతంలో కంటే ఈసారి 50 వేలకు పైచిలుకు మెజార్టీతో గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేశారు. రెట్టింపు ఉత్సాహంతో అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్ననని అన్నారు. కరోనా కష్టకాలంలో, వరదలు వచ్చినప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేశానన్నారు.
చేయికి ఓటేస్తే రైతులకు ఇబ్బందే
కాంగ్రెస్ వాళ్లకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరిలా చేస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముచ్చటగా మూడోసారి శాసనసభ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. అలాగే మలిదశ ఉద్యమానికి ఆలోచనకు పురుడు పోసిన వరంగల్ మహానగరం, తెలంగాణ ఉద్యమానికి కాకతీయ విశ్వవిద్యాలయం కూడా ఎంతగానో కృషి చేసిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దగాపడ్డదని, స్వరాష్ట్ర సాధన కోసం 2001లో గులాబీ జెండాను ఆవిష్కరించి రాజకీయ ఉద్యమ పార్టీగా అవతరించి, నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రాష్ట్రం సాధించేవరకు అనేక కార్యక్రమాలు చేశామన్నారు. హనుమకొండ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశానని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐదుగురు ఎంపీలు, 32 పార్టీల దగ్గరికి తిరిగి 88 మందిని ఒప్పించి తెలంగాణకు సానుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లెటర్లు ఇచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ రెండు సార్లు మోసం చేసింది
తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనుకుంటే సోనియా గాంధీ 2006 లోనే ఇచ్చేవారని, అప్పుడు ఇవ్వనందుకే రాజీనామా చేసి బయటికి వచ్చామని వినోద్ కుమార్ అన్నారు. ప్రజలు ఉపఎన్నికల్లో కూడా ఆశీర్వదించారని తెలిపారు. 2009లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ముందుకు వెళ్లిందని, చిదంబరం తెలంగాణను అప్పుడు ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకున్నారని అన్నారు. 2014 పార్లమెంట్లో బీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిందని, ఉద్యమంలో యువతి యువకులు రైతులు అన్ని పార్టీల మద్దతును కూడా కూడగట్టిందని అన్నారు. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పదనే విషయాన్ని గ్రహించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పి మోసం చేసిందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు ఉండదు కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లి మాట్లాడినప్పుడు మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తామని రైతులకు మోసం చేయడమే అని వినోద్ కుమార్ అన్నారు. చేయి గుర్తుకు ఓటు వేస్తే రాత్రిపూట లైట్ పట్టుకొని బాయల కాడికి పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణలో ఒక్క సెకండ్ కూడా కరెంటు పోవడం లేదని, లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రంలో చాలా చక్కగా పనిచేస్తుందన్నారు. ఒక్కరు నిమిషం కూడా కర్ఫ్యూ లేదని,144 సెక్షన్లు ఎక్కడా పెట్టలేదని అన్నారు.