తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Damagundam Vlf Station: దామగుండం Vlf స్టేషన్‌ ఏర్పాటుపై బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

Damagundam VLF Station: దామగుండం VLF స్టేషన్‌ ఏర్పాటుపై బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

Sarath chandra.B HT Telugu

31 January 2024, 9:41 IST

google News
    • Damagundam VLF Station: దామగుండంలో భారత నావికా దళానికి చెందిన విఎల్‌ఎఫ్‌ రేడియో ట్రాన్స్‌మిషన్‌ కేంద్రం ఏర్పాటుపై బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. 
దామగుండం భూములను అప్పగిస్తున్న సిఎం రేవంత్
దామగుండం భూములను అప్పగిస్తున్న సిఎం రేవంత్

దామగుండం భూములను అప్పగిస్తున్న సిఎం రేవంత్

Damagundam VLF Station: దామగుండంలో ఇండియన్‌ నేవీ ఏర్పాటు చేస్తోన్న విఎల్‌ఎఫ్‌ ట్రాన్స్‌మిషన్ సెంటర్‌ బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కొద్ది రోజుల క్రితం నేవీకి భూమిని బదలాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని బిఆర్ఎస్ తప్పు పడుతోంది. జీవ వైవిధ్యం దెబ్బతినడంతో పాటు రేడియేషన్‌ ఉంటుందని, స్థానికుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. బిఆర్‌ఎస్‌ వాదనల్ని కాంగ్రెస్‌ తప్పు పడుతోంది.

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నేవీ ఏర్పాటు చేసే వెరీ- లో -ప్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌తో పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదనితెలంగాణ అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే రాడార్ కేంద్రం నిర్మాణానికి జీవో నం. 44 ద్వారా తుది అనుమతులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. తూర్పు నావికా దళం కెప్టెన్ సందీప్ దాస్, డీసీఎఫ్ శ్రీలక్ష్మితో కలిసి కొండాసురేఖ వివరణ ఇచ్చారు. రాడార్‌ కేంద్రంపై బిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

రాడార్ సెంటర్ ఏర్పాటుతో ప్రజలకు, పక్షులు, జంతువులకు ఎలాంటి ముప్పు కలగదని నిర్ధారించుకున్న తర్వాతే సంతకం చేసినట్టు చెప్పారు. విఎల్‌‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌తో చీమకు కూడా హాని కలగదని, దామగుండం అటవీ గ్రామాల నుంచి ప్రజలను తమిళనాడులోని తిరునల్వేలి. వీఎల్ఎఫ్‌ కేంద్రానికి తీసుకెళ్లి.. అవగాహన కల్పిస్తామన్నారు.

రక్షణ శాఖకు చెందిన బైసన్ పోలో మైదానంలో సచివాలయం కడితే తన కుమారుడు కేటీఆర్ సీఎం అవుతారని కేసీఆర్ ప్రయత్నించారని, ఆ భూమిని కేంద్రం ఇవ్వకపోవడంతో వీఎల్ఎఫ్ సెంటర్‌కు అటవీ భూమి బదలాయింపు ఆపేశారని ఆరోపించారు.

కేంద్రం నుంచి వచ్చిన కంపా నిధుల్ని నాటి ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి సురేఖ వివరించారు. వీఎల్ఎఫ్ సెంటర్‌కు రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తామని కెప్టెన్ సందీప్ దాస్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతున్న అటవీ భూమికి పరిహారంగా వికారా బాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు గుర్తించారని.. అక్కడ 11.74 లక్షల మొక్కలు నాటుతారని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీలక్ష్మి వివరించారు.

బిఆర్‌ఎస్‌ అనుమతులు ఇవ్వలేదు…

మరోవైపు పూడూరు మండలంలో నేవీ రాడార్‌ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు.

2009లోనే రాడార్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వం అటవీ భూమిని నేవీకి అప్పగించడం, జీవో జారీ చేయడం తగదని అన్నారు. రాడార్‌ ఏర్పాటుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం రాకముందే మొదటి అనుమతులు వచ్చాయని చెప్పారు. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, పూడూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజల కోరిక మేరకు కేసీఆర్‌ ప్రభుత్వం పదేండ్లపాటు రాడార్‌ కేంద్రాన్ని ఆపిందని వివరించారు.

రాడార్‌ ఏర్పాటుతో ఇక్కడి అడవిలోని 12,12,750 చెట్లను నరికివేయడంతోపాటు 157 రకాల పక్షులు నశించిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాడార్‌తో చుట్టుపక్కల గ్రామాలకు రేడియేషన్‌ ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో జారీచేసి అటవీ భూమిని నేవీకి అప్పగించడం, రాడార్‌ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాడార్‌ కేంద్రం ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఎలాంటి లాభం లేదని, ఈ ప్రాంతం వారికి ఎలాంటి ఉద్యోగాలు రావని తెలిపారు. ఎవరికీ ఇబ్బంది లేని ప్రాంతంలో రాడార్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాడార్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉంటామని తేల్చి చెప్పారు. కోర్టులో తమకు సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.

తదుపరి వ్యాసం