తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cpi Kunamneni: సాఫ్ట్‌వేర్‌ బతుకుల్లో నడుములు ఒంగిపోతున్నాయ్.. అసెంబ్లీలో కూనంనేని కామెంట్స్‌ వైరల్…

CPI kunamneni: సాఫ్ట్‌వేర్‌ బతుకుల్లో నడుములు ఒంగిపోతున్నాయ్.. అసెంబ్లీలో కూనంనేని కామెంట్స్‌ వైరల్…

Sarath chandra.B HT Telugu

31 July 2024, 11:19 IST

google News
    • CPI kunamneni: దూరపు కొండలు నునుపు చందాన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాల్లో విషాద కోణాన్ని అసెంబ్లీ సాక్షిగా సిపిఐ శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. 
తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్న కూనంనేని
తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్న కూనంనేని

తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్న కూనంనేని

CPI kunamneni: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాల్లో ఉన్న విషాద కోణాన్ని అసెంబ్లీ వేదికగా సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు, కనీస వేతనాలు, ఉపాధి అవకాశాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో కూనంనేని లేవనెత్తారు. రైతుల ఇబ్బందులు, ఉపాధి రంగంలో ఎదురవుతున్న సమస్యలు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆయన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల బాధల్ని కూడా అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు వైరల్‌‌గా మారాయి.

అంతా సాఫ్ట్‌వేర్‌ బాగుంటుంది అని అనుకుంటారని, సాఫ్ట్‌వేర్‌లో పనిచేసే పిల్లలు అదృష్ట వంతులు అనుకుంటున్నారని, కానీ వాళ్లు చూస్తున్నంత నరకం ఎవరు చూడటం లేదని, ఆ విషయం తనకు తెలుసని కూనంనేని చెప్పారు.

చాలామంది రోజుకు 14,16 గంటలు పనిచేస్తున్నారని అంతా సేపు పనిచేయిస్తున్న వారి మీద నియంత్రణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. సాఫ్ట్‌వేర్‌లో వచ్చే ఆ డబ్బులు ప్రభుత్వానికి, కంపెనీలకు రావడం మాత్రమే కాదని, ఓ వయసు తర్వాత పనిచేసి నడుములు విరిగిపోతాయి, అక్కడ నుంచి బయటకు వచ్చి పనిచేసే పరిస్థితి కూడా ఉండదన్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు కొద్ది రోజులు జీతభత్యాలు బాగానే వస్తాయని, తర్వాత పని చేయలేరని బయటకు వచ్చి వారు వేరే పనిచేయలేరని దీనిపై నియంత్రణ పెట్టకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. వెలుగు చూసి సంతోషిస్తే సరిపోదని లోపల పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు.

కూనంనేని చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇన్నాళ్లు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎవరికి పట్టలేదని సిపిఐ సభ్యుడు సభలో లేవనెత్తడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి వ్యాసం