History: రాచకొండ గుట్టల్లో ఆత్మాహుతి వీరగల్లులు - తెలంగాణలో ఇదే తొలిసారంట!
25 August 2022, 6:23 IST
- Rare Veeragallu Sculptures Identified: రాచకొండ గుట్టల పరిధిలో సరికొత్త చరిత్ర ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకేచోట ఐదు ఆత్మాహుతి వీరగల్లుల శిల్పాలు వెలుగు చూశాయి. తెలంగాణలో ఇలాంటి శిల్పాలు బయటపడం ఇదే తొలిసారి అని ఆధునిక చరిత్రకారులు అంటున్నారు.
ఆత్మాహుతి వీరగల్లులు
Rare Veeragallu Sculptures in Rachakonda Area: ఆత్మార్పణ చేసుకునే వీరభక్తిని తెలిపే ఆత్మార్పణ శిల్పాలు రాచకొండ గుట్టల ప్రాంతాల్లో వెలుగు చూశాయి. తెలంగాణ ప్రాంతంలో కొన్నిచోట్ల ఈ తరహా విగ్రహాలు కనిపించినప్పటికీ... ఇక్కడ దొరికిన విగ్రహాలు మాత్రం విభిన్నమైనవిగా తేల్చారు ఆధునిక చరిత్రకారులు. ఇక్కడ తల నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టువిగా గుర్తించారు.
veeragallu sculptures in loyapalli: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని లోయపల్లి పరిధిలో ఒకే చోట ఈ 5 ఆత్మాహుతి వీరగల్లుల శిల్పాలు బయల్పడ్డాయి. ఆధునిక తెలంగాణ చరిత్రకారుల బృందం సభ్యుడు దండేటికర్ యాదేశ్వర్ వీటిని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనరు రామోజు హరగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిల్పాలు చాళుక్య శైలిలో ఉన్నట్టు ప్రకటించారు. రెండు శిల్పాల్లో ఇద్దరు వీరులు అంజలి ఘటించి కూర్చున్నట్టు ఉన్నదని, ఆ వీరుల కీర్తి ఆచంద్రార్కం విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ వారి తలలకు ఇరువైపులా సూర్య, చంద్రులను చెక్కారని వెల్లడించారు.
veeragallu history: తలలపై చిన్న కిరీటాలు, చెవులకు జూకాలు, మెడలో హారాలు, భుజ కిరీటాలతోపాటు దండరెట్టలకు, ముంజేతులకు కంకణాలు ధరించి అర్ధ పద్మాసనంలో కూర్చున్న ఈ వీరగల్లుల శిల్పాలు చాలా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. ఆత్మాహుతి శిల్పాల్లో ఇవి చాలా అరుదైనవని, తెలంగాణలో ఇలాంటి శిల్పాలు కనిపించటం ఇదే తొలిసారి అని తెలిపారు. మధ్యలో ఉన్న ఓ విగ్రహం నడుము వరకు విరిగిపోయి ఉన్నదని, మిగిలిన రెండు శిల్పాల్లో ఇద్దరు వీరులు కుడిచేతపట్టిన కత్తులతో తమ తలలను నరుక్కొని ఎడమచేతుల్లో పట్టుకొని కనిపిస్తున్నట్టు వివరించారు.
ఈ వీరగల్లులు 14, 15వ శతాబ్ద కాలం నాటివిగా గుర్తించారు. శత్రువుల నుంచి ఊరి పొలిమేరల్ని, స్త్రీలను, పశువులను కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వీరుల జ్ఞాపకార్థం చేసిన విగ్రహ శిలలను వీరగల్లులు అంటారు అని హరగోపాల్ వివరించారు.
టాపిక్