Urban Population : తెలంగాణలో 2025 నాటికి పట్టణ జనాభా 50 శాతం
20 June 2022, 14:22 IST
- తెలంగాణలో పట్టణాల్లో నివసించే జనాభా పెరుగుతోంది. తెలంగాణలో పట్టణ జనాభా 2025 నాటికి 50 శాతానికి చేరుకోనుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం తెలంగాణలో పట్టణ జనాభా శాతం.. 46.8గా ఉంది. ఇది 2025 నాటికి 50 శాతంగా కానుంది. ఇందులో తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ ఈ వివరాలను వెల్లడించింది. నగరాలు, పట్టణాల అభివృద్ధిని ఆర్థిక వృద్ధికి గ్రోత్ ఇంజిన్లుగా నీతి ఆయోగ్ అనుకుంటోంది. ప్రజలకు జీవనోపాధిని అందించడంలో పట్టణాలు ముందంజలో ఉన్నాయని నీతి ఆయోగ్ తెలిపింది.
2014లో రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల పట్టణాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలను 142కి పెంచింది. భౌగోళికంగా చూస్తే రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో పట్టణాలు 3 శాతం కంటే తక్కువ భూభాగంలో ఉన్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పట్టణాల వాటా మాత్రం మూడింట రెండొంతులుగా ఉంది.
కొనుగోలు శక్తి విషయంలో హైదరాబాద్ నగరం రాష్ట్రంలోనే మెుదటిస్థానంలో ఉంది. భద్రత, ఆరోగ్య సదుపాయాలు, జీవించడానికయ్యే ఖర్చుల విషయంలోనూ హైదరాబాద్ టాప్ లో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సత్తా ఉన్న నగరాల్లో హైదరాబాద్ టాప్-30లో ఉందని నీతి ఆయోగ్ చెప్పింది. ప్రస్తుతం పట్టణ జనాభాలో తెలంగాణ కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ముందున్నాయి. దేశంలోని పట్టణ జనాభా జాతీయ సగటు 31.16 శాతంగా ఉంది.
టాపిక్