Mla Bethi Subhas Reddy : ఉద్యమకారులకు బీఆర్ఎస్ స్థానం లేదా?, రౌడీలు, గూండాలకు టికెట్లు- ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి
29 August 2023, 14:53 IST
- Mla Bethi Subhas Reddy : నేను ఏం తప్పు చేశాను? నన్నెందుకు బలి చేశారని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి
Mla Bethi Subhas Reddy : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా భేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో భేతి సుభాష్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మంగళవారం సుభాష్ రెడ్డి కార్యకర్తలు, తన అనుచరులతో భేటీ అయ్యి రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు.
కాంగ్రెస్ లోకి రమ్మని సంప్రదించలేదు
తన అనుచరులతో సమావేశం అనంతరం ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ....అందరికీ టికెట్లు ఇచ్చి, తనకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని నిలదీశారు. రౌడీలు, గూండాలకు టికెట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన తనకు టికెటు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. అయితే అధిష్టానం నిర్ణయం కోసం మరో 10 రోజులు వేచి చూస్తానని, అప్పటికీ పిలుపు రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాతే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్‌లోకి రమ్మని తనను ఎవరూ సంప్రదించలేదని సుభాష్ రెడ్డి తెలిపారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించిన తాను నిర్వహించానన్నారు. ఉద్యమ సమయంలో జరిగిన ఘటనలు గుర్తుచేసుకుంటే కన్నీళ్లు ఆగవన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోలీసులకు దొరక్కుండా ఆందోళనలు చేశానన్నారు. బీఆర్ఎస్ రెండుసార్లు పోటీచేసే అవకాశం కల్పించిందన్నారు. ప్రస్తుతం టికెట్ కేటాయించిన వ్యక్తి బండారి లక్ష్మారెడ్డి ఎప్పుడైనా బీఆర్ఎస్ జెండా మోశారా? అని ప్రశ్నించారు.
10 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ
బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టుకుని తిరుగుతున్నారని ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ లో తానొక్కడినే ఉద్యమకారుడినన్నారు. ఉద్యమకారులకు పార్టీలో స్థానం లేదా? అని ప్రశ్నించారు. ఉప్పల్ టికెట్ వేరే వ్యక్తికి కేటాయించే ముందు కనీసం తనతో ఒక మాట కూడా చెప్పలేదని ఆవేదన చెందారు. తానేం తప్పు చేశానని, తననెందుకు బలి చేశారని ఎమోషనల్ అయ్యారు. 10 రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని భేతి సుభాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఆస్తులు అమ్ముకున్నానన్నారు.