తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Rains: కరీంనగర్‌లో కరుణించని వరుణుడు... ముందుకు సాగని సాగుబడి, ఆందోళనలో రైతాంగం

Karimnagar Rains: కరీంనగర్‌లో కరుణించని వరుణుడు... ముందుకు సాగని సాగుబడి, ఆందోళనలో రైతాంగం

HT Telugu Desk HT Telugu

18 June 2024, 13:59 IST

google News
    • Karimnagar Rains: వానాకాలం సీజను జూన్ 1 నుంచి మొదలైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాభావంతో సాగుపనులు ఆశించినట్లుగా ముందుకు సాగక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఆశించిన మేరకు వర్షాలు కురవక కరీంనగర్  రైతాంగం ఆందోళన
ఆశించిన మేరకు వర్షాలు కురవక కరీంనగర్ రైతాంగం ఆందోళన

ఆశించిన మేరకు వర్షాలు కురవక కరీంనగర్ రైతాంగం ఆందోళన

Karimnagar Rains: సీజన్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ శాస్త్రవేత్తలు అంచనా వేసినా కురవాల్సిన వర్షపాతం కన్నా కరీంనగర్ జిల్లాలో 40, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30, జగిత్యాల జిల్లాలో 35, పెద్దపల్లి జిల్లాలో 48 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయింది. ఉమ్మడి జిల్లాలోని 7 శాతం మండలాలు మినహా 93 శాతం మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది.

గత యాసంగిలో ఆయకట్టుకు ముందుగానే ప్రాజెక్టుల నీటిని నిలిపి వేయటం. ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి ఎత్తిపోతలు లేకపోవటం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలమట్టం సగటున 49 మీటర్ల నుంచి 13.2 మీటర్లవరకు పడిపోయి పంటలసాగుకు ప్రతిబంధకంగా మారింది.

సాధారణం కంటే తక్కువ వర్షపాతం

ఉమ్మడి జిల్లాలో జూన్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కురియాల్సిన సాధారణ వర్షపాతం అంటే తక్కువ వర్షపాతం నమోదయింది. కరీంనగర్ జిల్లాలో 75.5 మిల్లీమీటర్ల సాదారణ వర్షపాతం కురియాల్సి ఉండగా 47 మిల్లీమీటర్లు కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 81.0 మిల్లీ మీటర్లకు 49.2 ఎంఎం లు, జగిత్యాల జిల్లాలో 83.3 ఎంఎం లకు 53.9 ఎంఎంలు, పెద్దపల్లి జిల్లాలో 79.9 ఎంఎం లకు 41.5ఎంఎంల వర్షపాతం నమోదైంది.

సాగుకు రైతన్న సిద్దం..చినుకు జాడ లేక అయోమయం

రైతులు ఏప్రిల్, మే మాసాల్లోనే దుక్కులు చేసుకుని ఎరువులు, పూడికమట్టి పొలాల్లోకి పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో జూన్ మొదటి వారం నుంచే పసుపు, మక్కలను విత్తుకోవటం, పత్తివిత్తనాలు నాటడం, జనుము, జీలుగ, పెసర, సోయాబీన్ వంటి పంటల విత్తనాలను విత్తుకోవటాన్ని రైతులు ఆరంబించినా వర్షాల్లేక వేసిన విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేకపోవటం, ఎండల తీవ్రత మళ్లీ పెరగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బావులు, బోర్లలో నీటిలభ్యత ఉన్న రైతులు వరినార్లను పోస్తుండగా మరో పక్షం రోజులు వర్షంలేకుంటే సాగుబడి కష్టసాధ్యమని రైతులు పేర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో వానాకాలం వరి ప్రధాన పంటకాగా స్వర్ణవంటి దీర్ఘకాలిక రకాల వరినార్లకు అదనుదాటనుంది. ఉమ్మడి జిల్లాలో అన్ని పంటలసాగు 12 లక్షల ఎకరాలు దాటనుందని అంచనా వేయగా ఇందులో వరి, పత్తి, మక్క, పసుపు ప్రధాన పంటలుగా ఉండనున్నాయి. ఇప్పటివరకు భారీవర్షం నమోదుగాకపోవటంతో భూగర్భ జలమట్టం పెరగకపోగా నేలలోని వేడిమి తగ్గక విత్తనాల మొలకశాతం గణనీయంగా తగ్గనుంది. నాలుగు జిల్లాల్లో ఇప్పటి వరకు సాగు విస్తీర్ణం కనీసం 7 శాతానికి కూడా చేరలేకపోవటం ప్రతికూలతను వెల్లడిస్తుండగా ముసురు వర్షం కురిస్తేనే వాతావరణం చల్లబడి, భూగర్భ జలమట్టం పెరిగి పైరుసాగుకు దోహదపడనుంది.

మరోవైపు శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేర్, శ్రీపాదఎల్లంపల్లి తదితర అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటినిల్వలు కనిష్టస్థాయికి చేరి వరద రాకుంటే పంటలకు ఏమాత్రం విడుదల చేయలేని పరిస్థితి ఉంది. వరుణుడి కరుణ పైనే పంటలసాగు విస్తీర్ణం ఆధారపడి ఉంది.

70-80 మిల్లీమీటర్లు కురిస్తేనే..

పంటల ఆదను దాట లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.తడిపొడి దుక్కులో చిత్త నాలువేసి నష్టపోవద్దు. ఆరుతడి పంటలను కనీసం 70-80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదై వాతావరణం చల్లబడిన తరువాతనే విత్తుకోవాలని సూచిస్తున్నారు. సోయా బీన్. మక్క, పసుపు, పత్తి, కంది, పెసర మినుమువంటి వాటిని పంటల రకాలు, కాలపరిమితిని బట్టి జులై నెలాఖరు వరకు విత్తు కోవచ్చని చిగురుమామిడి మండల వ్యవసాయ అధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. నీటి వసతిగల రైతులు వరినార్లు ప్రస్తుతం పోసుకోవచ్చని సూచించారు.

(రిపోర్టింగ్ కేవీరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

తదుపరి వ్యాసం