Division of AP Bhawan: భవనాలు ఆంధ్రాకు, ఖాళీ స్థలం తెలంగాణకు..ఏపీ భవన్‌పై హోంశాఖ కొత్త ప్రతిపాదనలు
05 May 2023, 7:11 IST
- Division of AP Bhawan:ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది గత వారం జరిగిన సమావేశంలో ఖాళీ స్థలాన్ని ఏపీకి ఇచ్చి భవనాలు తెలంగాణకు ఇవ్వాలని ఆ రాష్ట్రం కోరిన నేపథ్యంలో, హోంశాఖ కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది.
ఢిల్లీలో ఏపీ భవన్
Division of AP Bhawan: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ కీలక ప్రతిపాదన చేసింది. గతవారం జరిగిన సమావేశంలో ప్రస్తుత భవనాలను యథాతథంగా తెలంగాణకు అప్పగించి పటౌడీ హౌస్ స్థలాన్ని ఏపీ తీసుకోవాలని తెలంగాణ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అధికారుల నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు కథనాలు వెలువడిన ప్రభుత్వ అధికారులు మాత్రం దానిని ధృవీకరించ లేదు.
తాజాగా ఏపీభవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు తెరపైకి తీసుకువచ్చింది. ఏపీ భవన్ కింద ఉన్న భూమిలో తమకు 12.09 ఎకరాల్లో ఖాళీ భూమితోపాటు గోదావరి, శబరి బ్లాక్‌లు, నర్సింగ్ హాస్టల్‌ను ఇవ్వాలని తెలంగాణ గతంలో కోరింది. అయితే హోంశాఖ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు పూర్తి భిన్నమైన ప్రతిపాదన తెరపైకి తీసుకు వచ్చింది.
ప్రస్తుత భవనాలకు దూరంగా మాధవరావు సింధియా రోడ్డులో విడిగా ఉన్న 7.64 ఎకరాల్లో ఖాళీగా ఉన్న పటౌడి హౌస్ ను తెలంగాణ తీసుకోవాలని హోంశాఖ సూచించింది. మిగతా 12.09 ఎకరాల్లో ఖాళీ భూమితో పాటు గోదావరి, శబరి బ్లాక్‌లు, నర్సింగ్ హాస్టల్‌ను ఏపీ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది. ఇలా చేయడంతో జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన భూమి దక్కుతుందని పేర్కొంది. ఈ ప్రతిపాదన ప్రకారం ఏపీకి అదనంగా కొంత భూమి దక్కితే.. అందుకు సమాన విలువను ఏపీ సర్కార్ తెలంగాణకు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.
తెరపైకి ఐదు ప్రతిపాదనలు….
దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తిగా ఏపీ,తెలంగాణ భవన్‌ల పరిధిలో 19.73ఎకరాల భూములతో పాటు భవనాలు ఉన్నాయి. వీటిలో 12.09 ఎకరాల్లో ఏపీ, తెలంగాణ భవన్‌లు ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. శబరి బ్లాక్‌తో పాటు గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని, పటౌడీ హౌస్‌లో ఉన్న 7.64 ఎకరాల భూమిని తెలంగాణ తీసుకోవాలని కేంద్రం సూచించింది.
ఏప్రిల్ 26న జరిగిన సమావేశంలో ఏపీ భవన్ విభజనపై కేంద్రం హోం శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్, సంయుక్త కార్యదర్శి జి.పార్థసారథి నేతృత్వంలో ఇరురాష్ట్రాల అధికారులతో జరిగిన సమావేశం వివరాలను కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసింది. ఉమ్మడి ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం మూడు ప్రత్యామ్నయాలు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లను ఇచ్చినట్టు పేర్కొంది
ఏపీ ప్రభుత్వం కోరిన ఆప్షన్లలో తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్‌లో సగభాగం, ఏపీకి పటౌడీ హౌస్‌లో సగభాగం, గోదావరి బ్లాక్‌తో పాటు నర్సింగ్ హాస్టల్ బ్లాక్‌లను కేటాయించాలని కోరింది.
రెండో ఆప్షన్‌గా ఏపీకీ మొత్తం పటౌడీ హౌస్, శబరి బ్లాక్, తెలంగాణకు గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ కేటాయించాలని సూచించింది.
ఈ రెండు కాకుంటే మూడో ఆప్షన్‌గా తెలంగాణకు శబరి, గోదావరి బ్లాక్‌లను కేటాయించి ఆంధ్రాకు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ స్థలాలను పూర్తిగా అప్పగించాలని కోరింది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లను కేంద్రం ముందు ఉంచింది. తెలంగాణకు శబరి బ్లాక్, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ ఉన్న మొత్తం 12.09 ఎకరాల స్థలాన్ని కేటాయించి, ఏపీకి పటౌడీ హౌస్ స్థలాన్ని కేటాయిస్తే, ఏపీ నష్టపోయే భాగానికి విలువ కట్టి దానిని తెలంగాణ చెల్లిస్తుందని తెలిపింది. ఇది సాధ్యం కాకపోతే ఏపీ ప్రభుత్వం కోరినట్టు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ స్థలాలను పూర్తిగా దానికి అప్పగించి భవనాలు తెలంగాణకు ఇవ్వాలని కోరింది.
చివరి ప్రత్యామ్నయంగా గోదావరి, శబరి బ్లాక్‌లతో సహా నర్సింగ్ హాస్టల్ స్థలం మొత్తం 12.09 ఎకరాలు ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణకు 7.64ఎకరాల పటౌడీ హౌస్ స్థలాన్ని కేటాయించాలని సూచించింది. ఈ ప్రతిపాదన తమకు అమోదయోగ్యంగా ఉందని ఏపీ ప్రభుత్వం సమావేశంలో స్పష్టం చేసింది. చివరి మూడు ప్రతిపాదనల్లో ఒక దానిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలియ చేయాలని కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాలకు సూచించింది.