Telugu student dies in Scotland : ట్రెక్కింగ్ కు వెళ్లి జారిపడి...! స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
19 April 2024, 14:17 IST
- Telugu Students dead in Scotland: స్కాంట్లాండ్ దేశంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి మృతి చెందారు.
స్కాంట్లాండ్ లో తెలుగు విద్యార్థులు మృతి
Telugu students dead in Scotland: ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్కాంట్లాండ్ లో జరిగింది. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా బ్రిటన్ లోని ఓ యూనివర్శిటీలో చదువుకుంటున్నారు.వీరిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు ఉండగా… మరో విద్యార్థి ఏపీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న వీరిద్దరూ మరో ఇద్దరితో కలిసి…. బుధవారం పెర్త్‌షైర్‌లోని(Perthshire) లిన్ ఆఫ్ తమ్మెల్‌కి వెళ్లారు. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తుండగా… ప్రమాదవశాత్తుగా వీరిద్దరూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు…. వెంటనే గాలింపు చర్యలు చేపట్టి వారి మృతదేహాలను గుర్తించారు. వీరి మృతి విషయంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయినవారిని జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22)గా గుర్తించారు.
ఈ ఘటనపై లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి స్పందించారు “బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. భారత కాన్సులేట్ జనరల్ ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించారు. యూకేలోని విద్యార్థుల బంధువులకు కూడా సమాచారం ఇచ్చాం. ఏప్రిల్ 19వ తేదీన పోస్టుమార్టం జరుగుతుంది. ఆ తర్వాత మృతదేహాలను వారి స్వదేశానికి పంపుతాం” అని చెప్పారు.
యూనివర్శిటీ ఆఫ్ డూండీ ప్రతినిధి స్పందిస్తూ… ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. “ఇది మనందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన ఒక విషాద ప్రమాదం. ఈ అత్యంత క్లిష్ట సమయంలో మేము ఆ కుటుంబాలకు అండగా ఉంటాం" అని ఓ ప్రకటన విడుదల చేశారు.
అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్
Telugu Girls Caught Shoplifting in US: అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ స్టోర్ లో షాపింగ్ చేసిన వీరు ఎక్కువ వస్తువులు తీసుకున్నప్పటికీ కొన్నింటికి మాత్రమే డబ్బులు చెల్లించారు. మిగతా వస్తువులను డబ్బులను చెల్లించకుండానే కాజేసేందుకు యత్నించటంతో అక్కడి సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వీరిద్దరని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మార్చి 19వ తేదీన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది.
అరెస్ట్ అయిన ఇద్దరు అమ్మాయిలు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు కాగా… మరో అమ్మాయిది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా. షాప్ లిఫ్టింగ్ కింద వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. షాప్ లిఫ్టింగ్(shoplifting) అంటే… దొంగతనంలోనే ఇదో రకమైన మోసం. ఇందుకు సంబంధించిన సెక్షన్ కింద వీరిని బుక్చేశారు.