తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Us Students Death: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు దుర్మరణం

US Students Death: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు దుర్మరణం

Sarath chandra.B HT Telugu

15 January 2024, 7:45 IST

google News
    • US Students Death: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్ధులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. 
అమెరికాలో ప్రాణాలో కోల్పోయిన దినేశ్
అమెరికాలో ప్రాణాలో కోల్పోయిన దినేశ్

అమెరికాలో ప్రాణాలో కోల్పోయిన దినేశ్

US Students Death: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాలను విషాదంలో నింపింది. మృతుల్లో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి కాగా.. మరొకరు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

తెలంగాణలోని వనపర్తి పట్టణం రాంనగర్‌కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల ఏకైక కుమారుడు దినేశ్‌(23) బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత గత ఏడాది ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లారు.

అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రం ఫెయిర్‌ ఫీల్డ్‌లోని సేక్రెడ్‌ హార్ట్‌ విశ్వ విద్యాలయంలో ఎంఎస్‌ చదివేందుకు గత ఏడాది డిసెంబరు 28న వెళ్లారు.అమెరికా వెళ్లిన 17 రోజులకే తమ కుమారుడు నిద్రలోనే చనిపోయినట్లు అక్కడి పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని విద్యార్ధి తల్లిదండ్రులు తెలిపారు.

దినేశ్‌‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా విద్యార్థి కూడా ఈ ఘటనలో చని పోయాడని తెలిసిందన్నారు. ఒకే గదిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు నిద్రలోనే విగత జీవులుగా మారడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గదిలో విష వాయువులు పీల్చడంతో చనిపోయి ఉండొచ్చని స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని అమెరికా నుంచి వనపర్తికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు.

శనివారం రాత్రి భోజ నం చేసి గదిలో పడుకున్న విద్యార్థి నిద్రలోనే మృతి చెందాడని అంతకు మించి ఇతర విషయాలు తమకు తెలియదని బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మృతదేహం త్వరగా తీసుకువచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తదుపరి వ్యాసం