Malakpet Area Hospital: విషాదం.. ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి
13 January 2023, 14:33 IST
- Two pregnant womens died in Malakpet Hospital: చికిత్స కోసం వచ్చి ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఫలితంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
మలక్ పేట ఆస్పత్రిలో విషాదం
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్స కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి వద్ద హైటెన్షన్ వాతావరణ నెలకొంది. బాలింతల మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని అధికారులు చెబుతున్నారు.
ఏం జరిగిందంటే.. ?
నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలానికి చెందిన మహేశ్, భార్య సిరివెన్నెల తో కలిసి నగరంలో నివాసం ఉంటున్నారు. తన భార్యను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చాడు మహేశ్. ఆపరేషన్ చేసి వైద్యులు కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అస్వస్థతకు గురికావడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందంటూ ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే... మరో బాలింత కూడా మృతి చెందింది. ఏపీలోని తిరుపతికి చెందిన జగదీశ్.. తన భార్య శివాణిని ఈ నెల 9న మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో శివాని బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో మలక్‌పేట్ ఆస్పత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇలా బాలింతలు చనిపోవటంతో వారి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బాలింతల మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని వైద్యాధికారి సునీత స్పష్టం చేశారు. అన్ని పరీక్షలు చేశాకే డెలివరీ చేశామన్నారు. డెలివరీ తర్వాత సిరివెన్నెలకు హార్ట్‌రేట్ పెరిగిందని వివరించారు. హార్ట్ ప్రాబ్లమ్ రావడంతో గాంధీకి తరలించినట్లు చెప్పారు. మరో బాలింత శివాని డయేరియా సమస్యతో 10వ తేదీన మధ్యాహ్నం ఆస్పత్రికి తీసుకొచ్చారని సునీత వెల్లడించారు. నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో 11న మధ్యాహ్నం కాన్పు చేశారని... 12న రాత్రి మరోసారి అస్వస్థతకు గురైందని అన్నారు. కళ్లు తిరగడం, కనిపించకపోవడం వంటి పలు సమస్యలు రావటంతో వెంటనే గాంధీకి తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిందని చెప్పారు. ఈ మరణాలపై ఓ టీమ్ తో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.