Kavitha Vs Rajagopal Reddy : ఈడీ చార్జ్ షీట్ పై కవిత - రాజగోపాల్ మధ్య ట్విట్టర్ వార్...
21 December 2022, 18:42 IST
- Kavitha Vs Rajagopal Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో.. ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విటర్ యుద్ధం కొనసాగుతోంది. కవిత ట్వీట్ కి స్పందించిన రాజగోపాల్.. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ అంటూ గట్టిగా సమాధానం చెప్పారు.
బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత
Kavitha Vs Rajagopal Reddy : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ .. తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో... ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విట్టర్ యుద్ధం కొనసాగుతోంది. ఈ కేసులో సోమవారం 181 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ... అందులో 28 సార్లు కవిత పేరును ప్రస్తావించింది. కవితతో కలిసే ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రు మద్యం వ్యాపారం చేసినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ... రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. లిక్కర్ క్వీన్ పేరు చార్జ్ షీట్ లో 28 సార్లు ప్రస్తావించారని పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. "రాజగోపాల్ అన్న తొందరపడకు , మాట జారకు !! " 28 సార్లు " నా పేరు చెప్పించినా.. "28 వేల సార్లు" నా పేరు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail.." అని కవిత కౌంటర్ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత కాంగ్రెస్ నేత(Congress Leader) మాణిక్యం ఠాగూర్ కు కవిత రిప్లై ఇచ్చారు. "నాపై నిందలు పూర్తిగా బోగస్, అవాస్తవం. నా నిబద్ధతను కాలమే రుజువు చేస్తుంది. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే బీజేపీ ఇదంతా చేస్తోంది. రైతు వ్యతిరేక, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండగడుతుండడంతో బీజేపి భయపడుతున్నది" అని కవిత రిప్లై ఇచ్చారు.
కవిత ట్వీట్ కి స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. గట్టి సమాధానం చెప్పారు. " నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్, ఇంకా మీ తెరాస నాయకులు... పారదర్శకరంగా వచ్చిన 18000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయం లో నా పై విష ప్రచారం చేశారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలు కి వెళ్లడం ఖాయం" అని ఘాటుగా బదులిచ్చారు.
మరోవైపు.. ఈడీ ఛార్జ్ షిట్లో పేరు ప్రస్తావించిన తర్వాత.... కవిత ఇవాళ ప్రగతి భవన్ కి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే కేసుకి సంబంధించి సీబీఐ ఇటీవలే బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి వెళ్లి విచారించింది. కవిత పేరు లిక్కర్ స్కామ్(Kavitha Name In Liquor Scam) లో రావడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారులు ఛాయ్ బిస్కెట్లు తినడానికి రాలేదని ఇప్పటికే బండి సంజయ్(Bandi Sanjay) కామెంట్ చేశారు. ఎన్నో వ్యాపారాల్లో కవిత పెట్టుబడులు ఉన్నాయని.. ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలకు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. కావాలనే బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని అంటున్నారు.