TSRTC ITI Admissions : టీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు - చివరి తేదీ ఎప్పుడంటే..?
22 September 2023, 18:15 IST
- TSRTC ITI Admissions: ఐటీఐ కళాశాలలో చేరాలనుకునేవారికి టీఎస్ఆర్టీసీ అలర్ట్ ఇచ్చింది. వరంగల్‌లోని ఐటీఐ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
టీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలు
TSRTC ITI Admissions 2023: ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఆర్టీసీ. వరంగల్‌లోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వాంచింది. దరఖాస్తులకు జులై 31వ తేదీతో ఈ గడువు పూర్తి కాగా… స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
వరంగల్‌లోని TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. స్పాట్ అడ్మిషన్లకు రేపు (సెప్టెంబర్ 23) తుది గడువు అని తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలో వరంగల్ ములుగు రోడ్డులోని టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో రిపోర్ట్ చేయాలి. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలకు 9849425319, 8008136611 ఫోన్ నంబర్లను సంప్రదించాలి. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ సదుపాయాన్ని అర్హత గల విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించింది.
ప్రయాణికులకు దసరా ఆఫర్…
TSRTC News: దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది.
“బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలి.” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జానర్ సూచించారు.