TS Raj Bhavan Republic Day : తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు...గవర్నర్ తమిళ సై
26 January 2023, 8:45 IST
- TS Raj Bhavan Republic Day తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ తమిళసై వ్యాఖ్యనించారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో తమిళసై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ తమిళ సై పలు వ్యాఖ్యలు చేశారు.
రాజ్ భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో తమిళ సై
TS Raj Bhavan Republic Day తెలంగాణ రాజ్ భవన్‌లో 74వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ అకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎస్ శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం కేసీఆర్‌పై గవర్నర్ పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వ పని తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ తమిళ సై ఆరోపించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణలో ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చిన తమిళస, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో తన పాత్ర కూడా ఉంటుందన్నారు.
హార్డ్ వర్క్, నిజాయితీ తనకు ఉన్న బలాలు, తనకు తెలంగాణ అంటే చాలా ఇష్టమని చెప్పారు. కొందరికి తనంటే ఇష్టం ఉండకపోవచ్చని, తెలంగాణ అభివృద్ధిలో ఖచ్చితంగా తన పాత్ర ఉంటుందని చెప్పారు. అభివృద్ధి అంటే బిల్డింగుల నిర్మాణం కాదని, నేషన్ బిల్డింగ్ అని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు కేటాయిస్తున్న ప్రధాని మోదీక గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
అందరికి అభివృద్ధి కావాలని, కొందరికి మాత్రమే పరిమితం కాకూడదని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఫామ్ హౌస్‌ల నిర్మాణం, భవనాలు కట్టడం మాత్రమే అభివృద్ధి కాదని సగటు ప్రజల అకాంక్షలు కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తెలంగాణతో తనకున్న బంధం మూడేళ్లది మాత్రమే కాదని పుట్టుకతోనే తనకు తెలంగాణతో బంధం ఏర్పడిందన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ ప్రజల అభివృద్ధికి తాను కృషి చేస్తానని గవర్నర్ చెప్పారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ జాతీయ జెండా ఎగురవేశారు.
టాపిక్