తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Leak : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్.. పాత్రధారి ప్రవీణ్.. సూత్రధారి రేణుక !

TSPSC Leak : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్.. పాత్రధారి ప్రవీణ్.. సూత్రధారి రేణుక !

HT Telugu Desk HT Telugu

13 March 2023, 21:21 IST

google News
    • TSPSC Leak : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో 9 మంది నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా... అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్ కూడా లీకైందని గుర్తించామని చెప్పారు. గతంలో జరిగిన పరీక్షల పేపర్లేమైనా లీక్ చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో 9 మంది అరెస్ట్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో 9 మంది అరెస్ట్

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో 9 మంది అరెస్ట్

TSPSC Leak : సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మొదట టీఎస్పీఎస్సీ సర్వర్ హ్యాకింగ్ కి గురై ప్రశ్నపత్రాలు లీకైనట్లు భావించిన అధికారులు.... పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నాపత్రాల లీక్ ఇంటి దొంగల పనే అని తేల్చారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్.. ఔట్ సోర్సింగ్ నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డి... ప్రశ్నాపత్రాలను దొంగిలించారని గుర్తించారు. రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్ లతో కుదిరిన ఒప్పందం మేరకు ప్రశ్నపత్రాలు చోరీ చేశారని... వీరి నుంచి నలుగురు వ్యక్తులు పేపర్లు కొనుగోలు చేశారని విచారణలో తేల్చారు. ఈ వ్యవహారంలో మొత్తం 9 మంది నిందితులని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కి తరలించారు.

సూత్రధారి రేణుక...

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్పీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఉపాధ్యాయురాలు రేణుకతో స్నేహం ఉంది. ఈ క్రమంలోనే అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రం కావాలని రేణుక ప్రవీణ్ ను అడిగింది. భర్త ఢాక్యా నాయక్ తో కలిసి డీల్ చేసిన రేణుక... రూ. 10 లక్షలు ఇస్తామని ప్రవీణ్ కి చెప్పింది. దీంతో.. అతడు టీఎస్పీఎస్సీలో నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డి సహాయం కోరాడు. ఇద్దరూ కలిసి ప్రశ్నపత్రాలు ఉన్న కంప్యూటర్ పాస్ వర్డ్ ని తస్కరించారు. టీఎస్పీఎస్సీలో అన్ని కంప్యూటర్లు ఒకే ల్యాన్ కింద కనెక్ట్ అయి ఉండటంతో.. సర్వర్ లో పాస్ వర్డ్ టైప్ చేసి ప్రశ్నపత్రాలు యాక్సెస్ చేశారు. ఆ తర్వాత వాటిని పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకున్న ప్రవీణ్.... రేణుకకి ఇచ్చాడు. ఆమె నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నాడు.

రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్... అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులతో డీల్ సెట్ చేసేందుకు సహకరించాడు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ని సంప్రదించారు. డబ్బులు చెల్లించి పేపర్ తీసుకునేందుకు నిరాకరించిన శ్రీనివాస్... తనకు తెలిసిన వారితో డీల్ కుదిరేలా చేశాడు. ఈ క్రమంలోనే దినేశ్ నాయక్ , గోపాల్ నాయక్ సహా మరో ఇద్దరు అభ్యర్థులకి పేపర్ ఇచ్చారు. ఇలా రూ. 13.5 లక్షలు సేకరించారు. వీరందరూ రేణుక ఇంట్లోనే ప్రశ్నలపై అధ్యయనం చేసి సమాధానాలు సేకరించారు. అనంతరం మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు హాజరయ్యారు. ఈ తతంగం మొత్తం ఎవరికీ అనుమానం రాకుండా పూర్తవడంతో... ఇదే పంథాలో టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు కూడా ఇంటి దొంగలు లీక్ చేసినట్లు సమాచారం.

మార్చి 11న టీఎస్‌పీఎస్సీ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈ విషయాలన్నీ గుర్తించామని పోలీసులు వెల్లడించారు. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధించి పేపర్లు లీక్ అయ్యాయన్న అనుమానంతో టీఎస్పీఎస్సీ ఫిర్యాదు చేయగా... తాము దర్యాప్తు చేశామని, ఈ క్రమంలో మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్లు కూడా లీకయ్యాయని గుర్తించామని చెప్పారు. నిందితులు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారని... వారి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని వివరించారు. ప్రవీణ్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నామని... గతంలో జరిగిన పరీక్షల పేపర్లేమైనా లీక్ చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

కాగా.. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను రద్దు చేసే యోచనలో ఉంది. మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఓర్సీర్ తో పాటు మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం