Arogya Mahila Scheme: మహిళల కోసం మరో కొత్త స్కీమ్.. ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు
05 March 2023, 8:03 IST
- Arogya Mahila Scheme in Telangana:‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 నుంచి ఈ కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వివరాలను వెల్లడించారు.
ఆరోగ్య మహిళా పథకంపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
Arogya Mahila Scheme Updates: మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలను ప్రత్యేకంగా తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్. తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఆరోగ్య మహిళ' పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ స్కీమ్ లో భాగంగా... మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించనున్నారు. ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనేదే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం.
శనివారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి మంత్రి హరీశ్ రావ్ ఈ పథకంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి ఈ నెల 8 నుంచి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
8 రకాల పరీక్షలు ఇవే..
1. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు చేస్తారు.
2. ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్రీనింగ్ నిర్వహిస్తారు.
3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్‌యాసిడ్, ఐరన్‌లోపంతోపాటు విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు
4. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు
5. మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
6. నెలసరి, సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి, వైద్యంతోపాటు అవగాహన కల్పిస్తారు. అవసరమైనవారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
7. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి, అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
8. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారు.
పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ఈ వైద్య పరీక్షలు చేస్తామని మంత్రి హరీశ్ రావ్ తెలిపారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తామని వివరించారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక క్లినిక్‌లు ప్రారంభిస్తామని చెప్పారు. ఆయా వైద్య పరీక్షలపై ప్రత్యే క యాప్ ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే రెఫర్ చేస్తారని..పెద్దాసుపత్రుల్లో వారికి సాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్‌లు ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకూ చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్లకు వివరించి, పరీక్షలు, చికిత్స పొందేలా మహిళల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. 8న ప్రారంభించే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలని సూచించారు.
విస్తృత ప్రచారం, శిక్షణ
గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో సీపీఆర్‌పై విస్తృతంగా ప్రచారం చేస్తూ, అందరికీ అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కొవిడ్ తర్వాత కార్డియాక్ అరెస్ట్ ఘటనలు పెరిగినట్టు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెప్తున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారని, సీపీఆర్ చేస్తే కనీసం ఐదుగురిని బతికించే అవకాశం ఉన్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీపీఆర్ శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పటికే ప్రతి జిల్లాకు ఐదుగురు మాస్టర్ ట్రెయినీలను పంపించామని పేర్కొన్నారు. వారితో వైద్య, పోలీసు, మున్సిపల్, ఇతర విభాగాల సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గుండెపోటు వచ్చిన వారికి అపర సంజీవనిలా పనిచేసే ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (ఏఈడీ) లను మొదటి దశలో రూ.18 కోట్లతో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
కంటి వెలుగులో ఇప్పటివరకూ 63 లక్షల మందికిపైగా పరీక్షలు చేసినట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఒకో క్యాంపులో రోజుకు 100-120 మందికి సిబ్బంది పరీక్షలు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే కొన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు రాష్ట్ర సగటు కంటే తకువ జరుగుతున్నాయని, ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు దృష్టి సారించాలని ఆదేశించారు.