KCR On Independence Day : తెలంగాణలో 1.20 కోట్ల జాతీయ జెండాలు పంపిణీ
12 August 2022, 11:19 IST
- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం.. తెలంగాణ ప్రభుత్వం 1.20 కోట్ల జాతీయ జెండాలను పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
సీఎం కేసీఆర్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా కార్యక్రమాలు ఉండాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. 1.20 కోట్ల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు ఇవ్వాలన్నారు. జాతీయ పతాకాల ముద్రణ, దేశభక్తి ప్రచార కార్యక్రమాల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవానికి వారం ముందు నుంచి వారం తర్వాత వరకు 15 రోజులపాటు రాష్ట్రంలో ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని, అందుకోసం 1.20 కోట్ల త్రివర్ణ జెండాలను పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇంటింటికీ జెండా ఎగురవేయడం, క్రీడాపోటీలు, వ్యాసరచన, కవి సమ్మేళనం (కవుల సమ్మేళనం), జాతీయవాదం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 'స్వాతంత్య్ర పోరాటం, త్యాగాలు, ఆనాటి జాతీయ నాయకులు, పోరాటంలో అమరులైన వారి గురించి నేటి తరానికి అవగాహన కల్పించాలి.. ప్రతి తెలంగాణ పౌరుడు గ్రామం నుంచి పట్టణం వరకు స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలలో పాల్గొనాలి.' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
అన్ని జనావాస ప్రాంతాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, నగరాల్లోని స్టార్ హోటళ్లు, ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లలో దేశభక్తిని ప్రతిబింబించేలా జాతీయ జెండాలను ఎగురవేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పంచాయత్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు వజ్రోత్సవ జ్యోతిని వెలిగించేలా చూడాలన్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులు తమ అధికారిక లెటర్ ప్యాడ్‌లపై జాతీయ జెండా చిహ్నాన్ని ముద్రించాలని ముఖ్యమంత్రి సూచించారు. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మీడియా సంస్థలు తెరపై జాతీయ జెండాను ప్రదర్శించాలని, త్రివర్ణ పతాకాన్ని మాస్ట్ హెడ్‌లపై ప్రచురించాలని కోరారు. దేశభక్తిపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.