BRS On BJP Nirudyoga March: ఒక్క నిరుద్యోగైనా పాల్గొన్నాడా..? బీజేపీపై చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఫైర్
16 April 2023, 14:25 IST
- Chief Whip Dasyam Vinay Bhaskar : బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ లో ఒక్క నిరుద్యోగి అయినా పాల్గొన్నడా అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. బీజేపీ చేసే తప్పుడు ప్రచారాలను రాష్ట్రంలోని యువత నమ్మే పరిస్థితి లేదన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
Dasyam Vinay Bhaskar On BJP Nirudyoga March : రాష్ట్రంలోని బీజేపీ నేతలపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. నిరుద్యోగ మార్చ్ లో నిరుద్యోగులే లేరని... బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... శనివారం వరంగల్ లో బీజేపీ నిర్వహించిన నిరుద్యోగి మార్చ్ లో ఒక్క నిరుద్యోగైనా పాల్గొన్నాడా..? అని నిలదీశారు. 10 వేల మంది నిరుద్యోగులతో మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రగల్బాలు పలికారని ఎద్దేవా చేశారు.
"10 రోజుల నుంచి బీజేపీ నేతలు కాకతీయ యూనివర్సిటీతో పాటు కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు తిరిగారు. నిరుద్యోగులను మార్చ్ కు రావాలని బతిమిలాడారు. తీరా చూస్తే యువతి, యువకులు బీజేపీ పార్టీని చీదరించుకున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. దీన్ని బట్టి బీజేపీ నేతలరా ఆలోచించుకోవాలి. మీ తప్పుడు ప్రచారాలు, అసత్యపు ఆరోపణలు, అబద్ధపు హామీలను తెలంగాణ రాష్ట్ర యువత నమ్మే పరిస్థితిలో లేదు. మీరు ఈ రాష్ట్రంలో యువకులను రెచ్చగొట్టి అ శాంతిని రగిలించాలని చూస్తున్నారని అందరికి అర్ధం అయింది. రాజకీయ లబ్దికోసం మీరు శవాల మీద పేలాలు ఏరుకునే రకం అని ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. నిరుద్యోగులు ఎవరు రాకపోతే బండి సంజయ్ ఆదేశాలతో నయిమ్ నగర్ లోని హాస్టళ్లలో ఉండే విద్యార్థులను తరలించారు. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలో నివసించే అడ్డా కూలీలను నిరుద్యోగ మార్చ్ కు తీసుకువచ్చారు" అని వినయ్ భాస్కర్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడు తోకలు లేని బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ మాట్లాడం విచిత్రంగా ఉందన్నారు వినయ్ భాస్కర్. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగ నియమాకాలు చేయాలని నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే పేపర్లు లీకేజీ చేస్తున్న కుట్రదారులు బీజేపీ నాయకులు అని ఆరోపించారు. నిరుద్యోగ యువతి యువకులతోపాటు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్దిచెబుతారని వ్యాఖ్యానించారు. పదవులు రావాలంటే ప్రజల హృదయాలను గెలుచుకోవాలని,, కుట్రలు, కుతంత్రాలతో ప్రజలు ఆదరించరని హితవు పలికారు. నిన్న వరంగల్ లో జరిగింది నిరుద్యోగుల మార్చ్ కాదు... బీజేపీ రాజకీయ నిరుద్యోగుల మార్చ్ అని కామెంట్స్ చేశారు.
2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అపుడు మోదీ మోసం చేశారని... ఇపుడు 2 లక్షల ఉద్యోగాలు అంటూ బండి సంజయ్ మోసం చేస్తున్నారని వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ఢిల్లీలోని మోదీ ఇంటి ముందు మార్చ్ చేసి ఖాళీగా ఉన్న కేంద్ర ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడాలని హితవు పలికారు.