Telangana Govt : వీఆర్ఏల సర్దుబాటు.. కొత్తగా 14,954 పోస్టులు మంజూరు - శాఖలవారీగా వివరాలివే
04 August 2023, 22:00 IST
- Telangana Govt Latest News: వీఆర్ఏలను సర్దుబాటు చేసే క్రమంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
సీఎం కేసీఆర్ తో వీఆర్ఏ సంఘ ప్రతినిధులు (ఫైల్ ఫొటో)
Village Revenue Assistants Adjustment: వీఆర్ఏల సర్దుబాటు విషయంలో తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే వారిని క్రమబద్ధీకరించిన సర్కార్... త్వరలోనే పలు శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం పలు శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులు మంజూరు చేసింది ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
శాఖలవారీగా వివరాలు:
రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను సృష్టించింది ప్రభుత్వం. ఇక పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 679 సబార్డినేట్ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3,372 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను సృష్టించినట్లు వివరించింది. ఇందుకు అనుగుణంగా... క్రమబద్ధీకరించిన వీఆర్ఏల విద్యార్హతలను బట్టి సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు ఉన్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి పాసైనవారు, పదో తరగతి పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు కూడా ఉన్నారు. వీరి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారించే పనిలో ఉంది. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారిని భర్తీ చేయనున్నారు. ఇప్పటికే వీఆర్ఏల విద్యార్హతలను క్రోడీకరించారు. ఇక 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నారు. 2 జూన్ 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్ఎ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చనిపోయిన వీఆర్ఏల వారసుల వివరాలు, వారి విద్యార్హతలను కూడా సేకరించనున్నారు అధికారులు. వీరికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉంది.