TS Assembly : తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఏడు బిల్లులు….
12 September 2022, 7:24 IST
- TS Assembly తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో రెండో రోజు కీలకమైన పలు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. గత వారం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైనా సంతాప తీర్మానాలకే పరిమితమయ్యాయి. సోమవారం జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లుల్ని సభ ముందు ప్రవశ పెట్టనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు
TS Assembly తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బిఏసీ సమావేశంలో శాసనసభ నిర్వహణను నిర్ణయించడంతో సోమవారం సభా కార్యకలాపాలు జరుగనున్నాయి. శాసనసభలో కీలకమైన ఏడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్ర విద్యుత్ బిల్లు వల్ల జరుగబోయే పర్యావసాలపై సభలో చర్చించనున్నారు. సెప్టెంబర్ ఆరో తేదీన ప్రారంభమైన తెలంగాణ సమావేశాల్లో దివంగత సభ్యులకు సంతాప తీర్మానాలు సమర్పించిన తర్వాత ఉభయ సభల్ని వాయిదా వేశారు.
TS Assembly సోమవారం జరిగే తెలంగాణ శాసన సభ సమావేశాల్లో కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది. కేంద్ర చట్టానిక వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో చర్చ ద్వారా కేంద్రం తీరును ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. శాసనసభలో చర్చలో ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ కూడా పాల్గొంటారని టిఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
TS Assembly. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన వెంటనే విద్యుత్ బిల్లుపై చర్చిస్తాయి. చర్చ ద్వారా కేంద్ర ప్రభుత్వ చట్టంపై రాష్ట్ర అభిప్రాయాన్ని కేంద్రానికి తెలుపనున్నారు. మరోవైపు గత వారం శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన విమర్శలపై టిఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఈటలపై ఫిర్యాదు చేశారు.
TS Assembly లొ సోమవారం మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావుకు సభ సంతాపం తెలుపనున్నది. వివిధ శాఖలకు చెందిన ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ - పారిశ్రామిక ప్రాంత లీజుల రద్దు, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణ, బోధనాసుపత్రుల్లో వైద్య నిపుణుల వయోపరిమితి పెంపు, అటవీ యూనివర్సిటీకి సంబంధించిన, తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు, తెలంగాణ మోటర్ వెహికిల్ యాక్ట్ సవరణ బిల్లులు ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
అసెంబ్లీ ముందుకు కామన్‌బోర్డు బిల్లు
TS Assembly తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు సోమవారం అసెంబ్లీ ముందుకు రానున్నది. ఈ బిల్లును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లో ప్రవేశ పెడతారు. రాష్ట్రంలోని 15 యూనివర్శిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి కామన్ బోర్డు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు విద్యాశాఖ గతంలోనే జీవో సైతం జారీచేసింది. యూజీసీ నిబంధనలు అనుసరించే కామన్ బోర్డు పనిచేయనున్నది. సోమవారం అసెంబ్లీలో బిల్లుకు చట్టబద్దత కల్పించనున్నారు.