తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr: ఫ్రంట్ లు కాదు.. కావాల్సింది ప్రత్యామ్నాయ అజెండానే..

KCR: ఫ్రంట్ లు కాదు.. కావాల్సింది ప్రత్యామ్నాయ అజెండానే..

HT Telugu Desk HT Telugu

27 April 2022, 14:04 IST

google News
    • హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా తలపెట్టిన టీఆర్ఎస్ ప్లీనర్ లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. వేదికపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధితో పాటు జాతీయ అంశాలను ప్రస్తావించారు.
హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్లీనరీ
హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్లీనరీ (HT PRINT)

హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్లీనరీ

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన ఆయన..  అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్న పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు కేవలం టీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రసంగం... ఏం చెప్పారంటే

'రాష్ట్ర సాధనలో అనేక ఒడుదొడుకులు, అవమానాలు ఎదుర్కొన్నాం.ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేశానికి రోల్‌ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. కేంద్రం, పలు సంస్థల నుంచి వస్తున్న అవార్డులే రాష్ట్ర ప్రగతికి చిహ్నం. అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. అంకితభావంతో పనిచేసినందుకే రాష్ట్రంలో నేడు విద్యుత్‌ సమస్య లేదు. ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టమే టీఆర్ఎస్ కు విజయాలు. ధరణి ద్వారా రైతులు, భూ యజమానుల సమస్య పూర్తిగా తీరింది. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసరి ఆదాయం రూ.2,78,000. జీరో ఫ్లోరైడ్‌ రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం. తెలంగాణ తలసరి ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నాం. ఒకప్పుడు 3 ప్రభుత్వ వైద్యశాలలుంటే ఇప్పుడు 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. మరోవైపు నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి. నిన్నే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. నిరుద్యోగులు తలమునకలుగా కష్టపడుతున్నారు' అని అన్నారు.

దేశ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ వెళ్తోందన్న వార్తలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందనే దానిపై చర్చ జరగాలని అన్నారు. దేశంలో విపరీతమైన జాడ్యాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా కరెంట్ కోతలు ఉన్నాయని.. సాక్షాత్తు ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయని గుర్తు చేశారు. మరీ ఇలాంటి కరెంట్ కోతలకు కారణం ఎవరిని కేసీఆర్ ప్రశ్నించారు. అనవసరమైన పెడధోరణులు దేశంలో పెరుగుతున్నాయని.. అందుబాటులో ఉన్న వనరులను కూడా ఉపయోగించుకోలేని స్థితిలో భారతదేశం ఉందన్నారు. ఇలాంటి సమస్యలపై చర్చలు జరగడం లేదని... వాస్తవానికి ప్రపంచంలో అత్యంత యువశక్తి ఉన్న దేశం భారత్ అని చెప్పారు. ఉపన్యాసాలతో మైకులు పగిలిపోయాయి తప్ప.. దేశం కలలు గన్న ఆంక్షలు ఎందుకు అమలుకాలేదని నిలదీశారు. దేశంలో ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితులు అని అన్నారు.

‘13 కోట్ల యువత ప్రతిభాపాటవాలు విదేశాల్లో ఉపయోగపడుతున్నాయి. తాగునీరు, కరెంట్ లేదు.. కానీ ఉపన్యాసాలతో మైకులు పగిలిపోతున్నాయి. కానీ వీటిపై చర్చ జరగడం లేదు. ఇవాళ తెలంగాణలో ప్రతి రంగం అభివృద్ధి చెందుతోంది. వందల సంఖ్యలో అవార్డులు వస్తున్నాయి. ఇవి కూడా కేంద్రం ప్రభుత్వం ఇచ్చినవే. చిత్తశుద్ధితో చేసిన పనులే ఇందుకు తార్కాణం. దేశంలో 401035 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్నా.. వినియోగించుకోలేని పరిస్థితి లేదు. 2 లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ వాడుకోవటం లేదు. వెలుగులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. తెలంగాణ పని చేసినట్లు దేశం పని చేస్తే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అభివృద్ధి చెందేది. ఎన్నో జీవ నదులు ప్రవహించే భారత్ దేశంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ తలసరి ఆదాయంలో చారాణా కూడా లేని రాష్ట్రాల సీఎంల వచ్చి మనకు పాఠాలు చెబుతున్నారు. రేషన్ బియ్యం ఇచ్చినందుకే ఓటు వేయలా..? అపారమైన సంపంద ఉన్న దేశంలో ఇలాంటి పరిస్థితిలు ఎందుకు వచ్చాయి..? ఫ్రంట్ లు చాలా వచ్చాయి.. ఏం చేశాయి..? కావాల్సింది రాజకీయ పునరేకీకరణలు కావు. నేడు దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ అజెండా. ఇందుకోసం పునాది పడాలి' అని కేసీఆర్ చెప్పారు.

 

టీఆర్ఎస్ ప్లీనరీలో మొత్తం 13 తీర్మానాలను సభ ముందుకు తీసుకురానుంది. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర వంటి అంశాలను పొందుపరిచారు.

తీర్మానాలు ఇవే...

-యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం

-దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం

-ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం

-చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్​లో ఆమోదింప చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

-భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం

-బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

-తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

-రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్​ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్​లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం

-నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో వాటాపై ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం

-భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం

-తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

-చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

-దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానం

సంబంధిత కథనం

టాపిక్

తదుపరి వ్యాసం