Boora Narsiah Resignation : టీఆర్ఎస్ పార్టీకి బూరా నర్సయ్య గౌడ్ రాజీనామా
15 October 2022, 10:56 IST
- Boora Narsiah Resignation మునుగోడు ఉప ఎన్నికల వేళ టిఆర్‌ఎస్ పార్టీని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వీడారు. టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన బూర నర్సయ్య టిఆర్‌ఎస్ పార్టీలో తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. టీఆర్‌ఎస్ పార్టీలో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను పార్టీలో కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్ధి నామినేషన్ వేసే సమయంలో కూడా వెన్నంటి ఉన్న బూర నర్సయ్య బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
Boora Narsiah Resignation టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రకటించారు. 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బూర నర్సయ్య 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున నర్సయ్యగౌడ్ టికెట్‌ను ఆశించారు. పార్టీ అధిష్టానం బూర నర్సయ్యగౌడ్ పేరును పరిగణలోకి తీసుకోకపోవటంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రాజీనామా లేఖలో పలు అంశాలను బూర నర్సయ్య ప్రస్తావించారు.
తాను తెలంగాణ ఉద్యమంలో టి-జాక్ లో భాగంగా 2009 నుండి బిజీ ప్రాక్టీస్ ను కూడా లెక్కచేయకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు శక్తి వంచన లేకుండా ఉద్యమంలో పాల్గొన్నానని నర్సయ్య చెప్పారు. జరిగింది. తెలంగాణ రాష్ట్ర ము రావడం వల్ల అందరి కల నెరవేరిందని తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని, భువనగిరి ఎంపీగా గెలిచి శక్తి వంచన లేకుండా, నియోజక వర్గ అభివృద్ధికి, ఇటు తెలంగాణ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. దాని ఫలితమే ఎయిమ్స్ , కేంద్రీయ విద్యాలయం, జాతీయ రహదారులు , ఇలా ఎన్నో అభివృద్ధి పనులు సాధించినట్లు చెప్పారు. ఇటు ఢిల్లీలో కూడా తెలంగాణ అభివృద్ధికి, తన వంతు పాత్ర పోషించానన్నారు. ఎలాంటి అవినీతి, ఆరోపణ లేకుండా పనిచేశానని తెలంగాణ ప్రగతితో పాటు,తెరాస పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు ఏరియా ఎంఎల్ఏల గెలుపు కొరకు శక్తి మేరకు కృషి చేశానని, ప్రచారం చేశానని కేవలం తెరాస గెలవాలని , కేసీఆర్ ముఖ్య మంత్రి కావాలని కసితో తిరిగినట్లు చెప్పారు. తన పాత్రచిన్నది అయినా కొంత ఎంఎల్ఏ ల గెలుపు కొరకు తోడ్పడిందని 2019 పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ ఎంపీ గా పోటీ చేసే అవకాశం ఇచ్చారని 5 ఏండ్లలో చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయి అని అందరు ఊహించారని, కానీ స్వల్ప మెజారిటీతో , బుల్డోజర్ గుర్తు, అంతర్గత కుట్రల వలన ఓడిపోయిన సంగతి కేసీఆర్‌కు తెలుసన్నారు.
మే 25 , 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండి, నియోజక వర్గం లో తిరుగుతు, తెరాస పార్టీలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఎంపీగా ఓడిపోయిన తర్వాత తాను ఎదురుకున్న అవమానాలు, అవరోధాలను కేవలం తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వడం వలన, కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం వలన భరించినట్లు చెప్పారు. ఎప్పుడు ప్రజల సమస్యలు తప్ప, వ్యక్తిగత ప్రయాజనాల కొరకు మీ వద్ద పైరవీలు చేయలేదని, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నా యొక్క అవసరం పార్టీకి లేదని తెలిసిందన్నారు.
తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయకపోవడాన్ని బూరా నర్సయ్య తప్పు పట్టారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా ఒక మాజీ ఎంపీ అయినా ఒక్క సారి కూడా మాతో సంప్రదించలేదని నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో, ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగి ఉన్నానని చెప్పారు. మునుగోడు టికెట్ అసలు నాకు సమస్యనే కాదని కానీ బీసీ సామజిక వర్గానికి టిక్కెట్ పరిశీలించండి అని అడగటం కూడా నేరమే అయితే అసలు ఈ పార్టీలో ఉండటమే అనవసరం అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య , రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరమని, అభిమానానికి , బానిసత్వానికి చాల తేడా ఉందన్నారు. వ్యక్తిగతంగా అవమాన పడ్డా, అవకాశాలు రాకున్నా పర్వాలేదని కానీ అట్టడుగు వర్గాల సమస్యలు కనీసం మీ దృష్టికి తీసుకు వచ్చే అవకాశమే లేనప్పుడు, తెరాసపార్టీలో కొనసాగడం అర్థరహితం. రాజకీయ వెట్టి చాకిరీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని బూర నర్సయ్య ఆరోపించారు.
టాపిక్