Vikarabad Tragedy: వికారాబాద్‌లో విషాదం, ఆధార్ కార్డు లేదని 108లో వైద్యం నిరాకరణ, పాముకాటుతో బాలిక మృతి
16 December 2024, 9:23 IST
- Vikarabad Tragedy: వికారాబాద్‌లో దారుణం జరిగింది. పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు చికిత్స అందించడానికి ఆధార్ కార్డు కోసం పట్టుబట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సకాలంలో వైద్యం అందకపోవడంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది.
ఆధార్ కార్డు లేదని వైద్యం నిరాకరించడంతో బాలిక మృతి
Vikarabad Tragedy: పాముకాటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు వైద్యం అందించకుండా 108 సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో పరిస్థితి వికటించి బాలిక ప్రాణాలు కోల్పయిన ఘటన వికారాబాద్‌లో జరిగింది. రాత్రి సమయంలో చీకట్లో పాముకాటుకు గురైన బాలికను ఆధార్ కార్డు లేదనే కారణంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి నిరాకరించడంతో ప్రాణాలు కోల్పోయింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 108 సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం నందారంలో సంచార జీవనం గడిపే కుటుంబంలో బాలికతో పాటు ఆమె తల్లి బిక్షాటన, కూలీ పనులతో జీవనం సాగించే వారు. 17ఏళ్ల సంగీత , దివ్యాంగురాలైన ఆమె తల్లి రంగమ్మలు భిక్షాటనతో పాటు గ్రామంలో కూలీ పనులు చేసుకునే జీవించే వారు. నిరాశ్రయులైన వీరు ప్రస్తుతం గ్రామంలోని ఓ పాత భవనంలో తలదాచుకుంటున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు భోజనం చేసిన తర్వాత పాత భవనంలో గోడ మీద చెయ్యి పెట్టడంతో అక్కడే ఉన్న సంగీతను కాటు వేసింది.
పాముకాటు వేయడంతో బాలిక కేకలు వేస్తూ తల్లికి చెప్పడంతో చుట్టుపక్కల వారి సాయంతో 108కి సమాచారమిచ్చారు. స్థానికులు ఫోన్ చేసిన అరగంట తర్వాత 10.30 గంటలకు అంబులెన్స్ వచ్చింది. తల్లితో పాటు పాము కాటుకు గురైన సంగీతను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనతో తాండూరు ఆసుపత్రికి తరలించారు. అందుబాటులో ఉన్న మందులతో వైద్యులు చికిత్స చేసినా బాలిక ఆరోగ్య పరిస్థితి మారలేదు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో సంగీత తల్లి రంగమ్మ స్థానికుల సహాయంతో మరోసారి 108 అంబులెన్సు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
అర్థరాత్రి దాటిన తర్వాత తాండూరు ఆస్పత్రికి 108 వాహనం చేరుకుంది. అయితే హైదరాబాద్ ప్రభుత్వాసుపత్రుల్లో ఆధార్ కార్డు లేని వారిని చేర్చుకోరని 108 సిబ్బంది ఆమెకు చెప్పారు. పాముకాటుకు గురైన తర్వాత తమతో పాటు ఏమి తెచ్చుకోలేదని చెప్పడంతో ఆధార్ కార్డు ఉంటేనే అంబులెన్సులో తీసుకెళ్తామని స్పష్టం చేశారు. స్థానికులు నచ్చజెప్పినా సిబ్బంది హైదరాబాద్ తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. కాసేపటికే పరిస్థితి విషమించి సంగీత ప్రాణాలు కోల్పోయింది. తన బిడ్డ ప్రాణాలు కోల్పోడానికి అంబులెన్సు సిబ్బందే కారణమంటూ రంగమ్మ విలపించడం అందరిని కలిచి వేసింది.