Nirmal Food Poison: నిర్మల్‌లో విషాదం, బిర్యానీ తిని యువతి మృతి.. 20మందికి అస్వస్థత
06 November 2024, 8:09 IST
- Nirmal Food Poison: నిర్మల్‌లో విషాదం జరిగింది. హోటల్ బిర్యానీ తిని యువతి మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. అపరిశుభ్ర వాతావరణంలో హోటల్ నిర్వహించడంతోనే అనారోగ్యం బారిన పడినట్టు గుర్తించారు. హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు.
నిర్మల్‌లో కలుషిత ఆహారం తిని పలువరికి అస్వస్థత
Nirmal Food Poison: నిర్మల్‌లోని హోటల్లో కలుషితాహారం తిని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చరకు చెందిన యువతి మృతి చెందింది. ఈ ఘటనలో మరో నలుగురు ఉపాధ్యాయినులు అస్వస్థతకు గురయ్యారు. అదే హోటల్లో బిర్యానీ తిన్న పలువురు అస్వస్థతకు గురయ్యారు.
బోథ్ మండలం పొచ్చర ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు.. ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. వారి ఇళ్లల్లో పనులు చేయడానికి వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి పూల్ కాలీ బైగా(19) ఉంటోంది. ప్రిన్సిపల్ స్మిత, వైస్ ప్రిన్సిపల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫి, సిజితోపాటు పూల్ కాలీ బైగా శనివారం నిర్మల్‌లోని ఏఎన్‌రెడ్డి కాలనీలోని గ్రిల్ 9 అనే హోటల్‌లో మాంసాహారం తిని ఇంటికొచ్చారు.
అదే రోజు అర్ధరాత్రి అందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆది, సోమవారం బోథ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందారు. మంగళవారం పూల్ కాలీ బైగా తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో మళ్లీ బోథ్ సీహెచ్‌సీకి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. మిగతా నలుగురు హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇదే హోటల్లో బిర్యానీ తిన్న పలువురు అస్వస్థతకు గురైనట్టు గుర్తించారు. 20 మంది వరకు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్-9 హోటల్‌లో నవంబర్ 2, 3 తేదీల్లో భోజనం చేసిన వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
ఇలా అనారోగ్యానికి గురైన వారిలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్‌రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ స్మితా జార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫీ, ఫిజీ, వంటమనిషి ఫూల్‌కాలీబైగా (19) ఉన్నారు. వీరంతా నవంబర్ 2న షాపింగ్ కోసం నిర్మల్‌కు వచ్చారు. రాత్రి తిరిగి పాఠశాలకు వెళుతూ గ్రిల్-9 హోటల్‌లో రాత్రి భోజనం చేశారు. చికెన్-65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్‌రైస్ తిన్నారు. 2వ తేదీ అర్ధరాత్రి నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి.
బోథ్ సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఫూల్‌కాలీబైగా మంగళవారం మృతిచెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఫూల్‌కాలీబైగా ఉపాధి నిమిత్తం సెయింట్ థామస్ స్కూల్‌లో వంటపని చేసేందుకు వచ్చినట్టు పాఠశాల ప్రిన్సిపల్ స్మితాజార్జ్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిర్మల్ పోలీసులకు బదిలీ చేశారు.
ఖానాపూర్‌కు చెందిన పదిమంది వరకు యువకులు ఈ హోటల్‌లో ఆరగించి వెళ్లగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. హోటల్‌లో వండిన ఆహారం విషతుల్యం కావడం వల్లే భోజనం పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురైనట్లు తేలింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు ఇక్కడి మండీ బిర్యానీ కొనుగోలు చేసి అనారోగ్యం బారిన పడ్డారు. బోథ్ స్కూల్ స్టాఫ్‌తో కలిసి దాదాపు 25 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు.