Traffic Advisory : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు….
16 August 2022, 7:29 IST
- 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో పక్షం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మంగళవారం భాగ్య నగరంలో భారీ ఎత్తున జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
అబిడ్స్‌లోని జిపిఓ సర్కిల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు.
లిబర్టీ, బషీర్‌బాగ్ ప్రాంతాల నుంచి బిజేఆర్ సర్కిల్ వైపుకు వచ్చే వాహనాలను అబిడ్స్ వైపు అనుమతించరు. నాంపల్లి రైల్వే స్టేషన్, ఏఆర్ పెట్రోల్ బంకుల మీదుగా వాటిని మళ్లిస్తారు.
లిబర్టీ నుంచి బీజేఆర్ సర్కిల్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని హిమాయత్ నగర్, నారాయణగూడ, కాచిగూడ, కోటిల వైపుకు మళ్లిస్తారు. కింగ్ కోటి నుంచి అబిడ్స్ మెయిన్ రోడ్డు మార్గంలోకి వాహనాలను అనుమతించరు. కోఠి క్రాస్ రోడ్ మీదుగా హనుమాన్ టెక్డీ, ట్రూప్ బజార్, కోఠీ వైపు మళ్లిస్తారు.
బొగ్గుల కుంట నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను బొగ్గుల కుంట క్రాస్ రోడ్ నుంచి హనుమాన్ టెక్డీ, ట్రూప్ బజార్, కోఠీ వైపు మళ్లిస్తారు. ఎంజె మార్కెట్, జాంబాగ్‌ల నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలు ఎంజె మార్కెట్ నుంచి నాంపల్లి స్టేషన్ వైపు మళ్లిస్తారు.
ముఖ్యమంత్రి కార్యక్రమం నేపథ్యంలో ఉదయం 9.30 నుంచి 12.30 మధ్య సోమాజీగూడ, ఖైరతాబాద్, రవీంద్ర భారతి జంక్షన్, అసెంబ్లీ, ఎల్‌బి స్టేడియం, పిజెఆర్ స్టాట్యూ, లిబర్టీ, హిమాయత్‌నగర్, జిపిఓ అబిడ్స్, ఎంజె మార్కెట్, నాంపల్లి మార్గాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు లిబర్టీ మీదుగా అబిడ్స్ సర్కిల్ వచ్చే వాహనాలు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాలి. తాజ్‌మహాల్ నుంచి కోఠీ క్రాస్ రోడ్స్, బాటా నుంచి బొగ్గుల కుంట క్రాస్ రోడ్స్ వైపు వచ్చే వారు జిహెచ్‌ఎంసి ఆఫీసు, రామకృష్ణ థియేటర్, జార్జి గ్రామర్ స్కూళ్లలో వాహనాలను పెట్టుకోవాలి. మొజంజాహీ మార్కెట్, అప్ఝల్ గంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వాహనాలను నిలుపుకోవాలి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30వరకు వాహనాలు అయా మార్గాల్లో ప్రయాణించకుండా ప్రత్యామ్నయ మార్గాలలో ప్రయాణించాల్సిందిగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
టాపిక్