Siddipet Road Accident: సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం…ఏడుగురికి తీవ్ర గాయాలు
29 February 2024, 13:42 IST
- Siddipet Road Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కుటుంబంతో కలిసి సంతోషంగా వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా వారిని మృతువు కబళించింది
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Siddipet Road Accident: . సిద్దిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం రాంపల్లి గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదం విషాదాన్ని నింపింది. నంగునూరు మండలం బుద్దిపడగ గ్రామానికి చెందిన కట్ట రవి (55),ఆయన వియ్యంకుడైన నాగరాజుపల్లె గ్రామానికి చెందిన ముక్కర ఐలయ్య (60) ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై బుద్దిపడగ గ్రామానికి వెళ్తున్నారు.
కొండపాక మండలం దుద్దెడకు చెందిన జక్కలి అనిల్,భార్య మమత (28), పిల్లలు,బావమరిది కుటుంబంతో కలిసి కారులో బంధువుల పెళ్ళికి హుస్నాబాద్ వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో రాంపల్లి శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న బైక్ ను కారు ఢీకొట్టి రోడ్డు కిందకు ఈడ్చుకెళ్లింది. దీంతో పక్కనే ఉన్న కాల్వలో కారు, బండి పడిపోయాయి.
ఒకరి పరిస్థితి విషమం, మిగతా వారికీ తీవ్ర గాయాలు ....
ఈ ప్రమాదంలో బైక్ పైన వెళ్తున్నముక్కర ఐలయ్య, కట్ట రవి,కారులో ఉన్న జక్కలి మమత అక్కడికక్కడే మృతి చెందారు. కారు లో ఐదుగురు పిల్లలు,నలుగురు పెద్దవారు ఉన్నారు. మమత మృతిచెందగా,బావమరిది బాబురాజు పరిస్థితి విషమంగా ఉంది.
మమత భర్త అనిల్‌తో పాటు మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సిద్ధిపేట ఆసుపత్రికి తరలించారు.
అంతసేపు పెళ్ళిలో బంధువులతో సంతోషంగా గడిపిన మమత అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యుల,బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కారు వేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. సిద్ధిపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..
మరో ఘటనలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్ర సమీపంలో జరిగింది.
వ్యవసాయ పనుల కోసం మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన పది మంది కూలీలు మోతె మండలం యస్సేనాబాద్ కు మిరపకాయలు ఏరడానికి ఆటోలో బయల్దేరారు.
మార్గమధ్యలో ఖమ్మం జిల్లా మధిర నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మోతె శివారులో మూలమలుపు వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా,ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో మరో ఐదుగురు కూలీలు గాయపడ్డారని గాయపడ్డారని తెలిపారు.