Medchal Tragedy: మేడ్చల్‌లో విషాదం, కూతుళ్లను కాపాడే క్రమంలో రైలు ఢీకొని.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
12 August 2024, 8:16 IST
- Medchal Tragedy: మేడ్చల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రితో పాటు ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. పట్టాలపై ఆడుకుంటున్న కూతుళ్లను కాపాడే క్రమంలో తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. భార్య కళ్లెదుటే ఈ విషాద ఘటన జరిగింది.
మేడ్చల్‌లో రైలు ఢీకొని తండ్రి కూతుళ్ల దుర్మరణం
Medchal Tragedy: మేడ్చల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భార్యాపిల్లలతో కలిసి అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబం క్షణాల్లో చిన్నాభిన్నమైంది. భార్య కళ్లెదుటే భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ట్రాక్‌పై ఆడుకుంటున్న పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో చిన్నారులు కూడా మృతి చెందారు.
రైల్వే కీ మ్యాన్‌గా పనిచేస్తున్న కృష్ణ ఆదివారం విధులకు హాజరయ్యాడు. గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై విధుల్లో ఉన్నాడు. రైల్వే ట్రాక్‌లను సరిచూసే విధుల్లో ఉండే కృష్ణకు ఆదివారం మధ్యాహ్నం భార్య భోజనం తీసుకువచ్చింది. తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా కృష్ణ పనిచేస్తున్న ప్రాంతానికి వచ్చారు. భోజనం చేసిన తర్వాత కాసేపు వేచి ఉంటే విధులు ముగించుకుని కలిసి ఇంటికి వెళ్లిపోదామని చెప్పడంతో భార్య కవిత అక్కడే వేచి ఉంది.
ఆ సమయంలో కృష్ణ రైల్వే ట్రాక్‌లను పరిశీలిస్తూ విధులు నిర్వర్తిస్తుండటంతో పిల్లలు ట్రాక్ సమీపంలో ఆటలాడుకుంటున్నారు. వారిని కాపాడే క్రమంలో రైలు దూసుకు రావడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మేడ్చల్‌లోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివసించే టి.కృష్ణ (38) గౌడవెల్లి రైల్వేస్టేషన్‌లో కీమ్యాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కృష్ణకు భార్య కవితతో పాటు, ఇద్దరు కూతుళ్లు పదేళ్ల వర్షిత, ఏడేళ్ల వరణి ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం కవిత తనతో పాటు ఇద్దరు కుమార్తెలను భర్తకు భోజనం ఇవ్వడానికి తీసుకువెళ్లింది.
భోజనం చేసిన తర్వాత కృష్ణ ట్రాక్ తనిఖీ పనుల్లో నిమగ్నమై ఉండగా.. పిల్లలు పట్టాలపై ఆడుకుంటున్నారు. ఆ సమయంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ దూసుకు వస్తుండటంతో వెనక్కి తిరిగి చూసిన కృష్ణకు ట్రాక్ మధ్యలో పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. రైలు నుంచి పిల్లలను కాపాడేందుకు రైలుకు ఎదురుగా పరుగెత్తుకొచ్చాడు. రైలు ఢీకొట్టి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లెదుట జరిగిన ప్రమాదాన్ని చూసి కవిత మ్రాన్పిడి పోయింది. కళ్లముందే భర్త, ఇద్దరు కూతుళ్లు చనిపోవడంతో గుండెలు బాదుకుంది.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన తోగరి కృష్ణ అత్వెల్లి పరిధిలోని రాఘ వేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. కృష్ణ రైల్వేలో ట్రాక్‌మన్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజులుగా మేడ్చల్ - మనోహరాబాద్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో డ్యూటీ వేశాడు. స్వగ్రామం లింగారెడ్డిపేటలో బోనాలు ఉండటంతో విధులు ముగిసిన తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలను తీసుకుని లింగారెడ్డిపేట వెళ్దామని భావించారు. భోజనం చేసిన తర్వాత భార్య, పిల్లలను స్టేషన్‌లో టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ఉండాలని సూచించి ట్రాక్‌పైకి పనిచేసేందుకు వెళ్లాడు. కృష్ణ పనిచేస్తుండగా చిన్న కూతురు వరిణి ట్రాక్‌పై దిగి తండ్రి వైపు వెళ్లిందని, ఆమె వెనుక పెద్ద కూతురు కూడా వెళ్లినట్టు కవిత తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు గౌడవెల్లి స్టేషన్ మీదుగా వెళుతోంది. గౌడవెల్లిలో ఆ రైలుకు హాల్టింగ్ లేకపోవడంతో రైలు వేగంగా వస్తుండటం, కూతుళ్లు ట్రాక్‌పైన ఉన్న విషయం గమనించిన కృష్ణ కేకలు వేసుకుంటూ పిల్లల వైపు పరిగెత్తుకు వెళ్లాడు. ప్రమాద సమయంలో పెద్ద కుమార్తె చేయి పట్టుకుని ప్లాట్‌ఫాం వైపుకు వెళ్లడంతో తప్పించుకోడానికి అవకాశం లేకుండా పోయింది. వారి వెనుక వచ్చిన కవిత మరో ట్రాక్‌పైకి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. క్షణాల్లో ఈ ఘటన జరగడంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు అందించిన సమాచారంతో పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.