Karimnagar Crime: రెచ్చిపోయిన అంతరాష్ట్ర దొంగలు,కరీంనగర్‌లో ఓ ముఠాకు చెందిన ముగ్గురి అరెస్ట్
19 September 2024, 6:46 IST
- Karimnagar Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దొంగలు రెచ్చి పోయారు. పోలీసుల పేరు చెప్పి కరీంనగర్ లో బైక్ తో సహా దొంగ పారిపోగా, జగిత్యాల జిల్లాలో బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న వ్యక్తిని అటకాయించి సినీపక్కిలో లక్షా 68 వేలు ఎత్తుకెళ్లారు. నిఘా పెట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
పోలీస్ వేషంలో కరీంనగర్‌లో చోరీలు
Karimnagar Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దొంగలు రూట్ మార్చారు. సినీ పక్కిలో చోరీలకు పాల్పడ్డారు. పోలీసులకు సవాల్ విసిరారు. కరీంనగర్ లో ట్రాఫిక్ పోలీస్ వేషాధారణలో బైకిస్ట్ ను మస్కా కొట్టించి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో పారిపోయాడు. అతని ఆచూకీ ఇంకా లబించకపోగా జగిత్యాల జిల్లాలో నలుగురు ఓ వ్యక్తి బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తుండగా వెంబడించి క్యాష్ బ్యాగ్ ను అపహరించుకపోయారు.
ట్రాఫిక్ పోలీస్ వేషాదరణలో చోరీ
కరీంనగర్ లో సినీఫక్కీలో చోరీ జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ వేషాధారణలో వచ్చిన దొంగ రాయల్ ఇన్ ఫీల్డ్ బైక్ ను అపహరించుకుపోయాడు. నగరంలోని తిలక్ రోడ్ కు చెందిన బొజ్జ శివం తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై పనిమీద బయటకు వచ్చాడు. శాస్త్రీరోడ్ సమీపంలోకి వచ్చేసరికి ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసు వేషధారణలో వచ్చి, ట్రాఫిక్ పోలీసునని పరిచయం చేసుకున్నాడు. ఎస్ఐ ని తీసుకొని వస్తానని చెప్పి శివం బుల్లెట్ బైక్ తీసుకొని వెళ్లాడు.
బైక్ తీసుకెళ్లిన వ్యక్తి ఎంతకూ రాక పోయేసరికి మోసపోయానని శివం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులమని చెప్పి బైక్ ను తీసుకొని పారిపోవడం చూస్తే ఆ దొంగకు ఎంత ధైర్యం ఉండాలని స్థానికంగా ఆసక్తికరంగా చర్చ సాగుతుంది.
జగిత్యాల జిల్లాలో రూ. లక్షా 68 వేలు అపహరణ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తుర్తి గ్రామానికి చెందిన పూరే నర్సయ్య మండల కేంద్రంలోని బ్యాంకులో 1లక్షా 68వేలు డ్రా చేశాడు. తన మనవరాలు ఆకలవుతుందంటే ఓ బేకరీ వద్ద బైకు నిలిపి అందులోకి వెళ్లాడు. అంతలోనే రెండు బైక్ లపై వచ్చిన నలుగురు నర్సయ్య బైక్ లో ఉన్న క్యాష్ బ్యాగును ఎత్తుకేళ్లారు.
నర్సయ్య బయటకు వచ్చి చూసెసరికి బైక్ లో బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు. బేకరీ బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా క్యాష్ బ్యాగ్ అపహరణ వీడియో రికార్డు అయింది. నర్సయ్య ను బ్యాంకు నుండి వెంబడించి అదునుచూసి క్యాష్ బ్యాగ్ ను ఎత్తికెళ్లినట్టు స్పష్టమయింది.
నిమజ్జనం రోజున చైన్ స్నాచింగ్
కరీంనగర్ సమీపంలోని దుర్శేడ్ వద్ద గణేష్ నిమజ్జనం సందర్భంగా చైన్ స్నాచింగ్ జరిగింది. నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు వెళ్లిన బోగ లక్ష్మి మెడలో నుంచి రెండున్నర తులాల పుస్తెల తాడును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. పోలీసుల అప్రమత్తమై నిఘా పెట్టారు.
ముగ్గురు అరెస్టు మరొకరు పరార్..
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన నలుగురు సభ్యులు గల ముఠాకు చెందిన ముగ్గురిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇందిరానగర్ కు చెందిన కట్ట హన్సర్ @ గడాఫ్ (19), నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జమలంకు చెందిన ఇంజపల్లి జగదీశ్వర్(19), దేవదాస్, మరో మైనర్ బాలుడు నలుగురు కలిసి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో నాలుగు చోరీలకు పాల్పడినట్లు కరీంనగర్ రూరల్ సిఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.
నలుగురు ఈనెల 10న మొగ్దుంపూర్ వైన్ షాప్ వాచ్ మెన్ అంజయ్య పై దాడి చేసి పక్కనే వున్న పర్మిట్ రూమ్ లో బందించి 39 వేల రూపాయల విలువగల మద్యాన్ని, 28 వేల నగదు తో పాటు వాచ్ మెన్ మొబైల్ ఫోన్ ను ఎత్తుకెళ్ళారని సిఐ తెలిపారు .అదే రోజున దుర్శేడ్ గ్రామానికి చెందిన సంపత్ ఆటో (TS 02 UB 9887)ను ఎత్తుకెళ్ళారు.
బొమ్మకల్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు ఆటో లో ప్రయాణిస్తుండగా పట్టుకుని విచారించగా వైన్ షాప్ లో చోరీ, ఆటోను ఎత్తుకెళ్ళినట్లు ఒప్పుకున్నారని సిఐ తెలిపారు. వారి నుంచి 55 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. దేవిదాస్ పరారీలో ఉండగా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ పంపామని తెలిపారు. నలుగురిపై కరీంనగర్లో మూడు, నిజామాబాద్ లో ఒక చోరీ కేసు ఉందన్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)