తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Road Accident : మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం, మరో ముగ్గురి పరిస్థితి సీరియస్

Road Accident : మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం, మరో ముగ్గురి పరిస్థితి సీరియస్

HT Telugu Desk HT Telugu

06 July 2024, 8:07 IST

google News
    • Road Accident in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
దంతాలపల్లిలో ఆటోను ఢీకొట్టిన కారు
దంతాలపల్లిలో ఆటోను ఢీకొట్టిన కారు

దంతాలపల్లిలో ఆటోను ఢీకొట్టిన కారు

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శుక్రవారం రాత్రి 8 గంటలు దాటిన తరువాత మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి ఆరుగురు ప్రయాణికులతో ఓ ఆటో మరిపెడకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆటో దంతాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోకి చేరుకోగా, మరిపెడ వైపు నుంచి ఓ కారు వేగంగా దంతాలపల్లికి వస్తోంది. అతివేగంగా వచ్చిన కారు దంతాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆటోను ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయి రెండు భాగాలుగా విరిగిపోయింది. దీంతో తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బంధు మల్లేష్(35), దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన పగిండ్ల కొమురయ్య(38), వాల్య తండాకు చెందిన భూక్య నరేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలోనే ఉన్న కొమురయ్య భార్య మంజుల, కూతురు అంజలి, మహబూబాబాద్ మండలం ఆమనగల్ గ్రామానికి చెందిన అక్షయకు తీవ్ర గాయాలయ్యాయి. 

మృతదేహాలు నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఇదిలాఉంటే ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉండగా, అక్కడి పరిస్థితి చూసి అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ముగ్గురి పరిస్థితి సీరియస్

ఘటన స్థలంలో పడి ఉన్న మృతదేహాలను పోలీసులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి పంపించారు. దీంతో బాధిత కుటంబ సభ్యులు మార్చురీకి చేరుకుని బోరున విలపించారు. కాగా తీవ్ర గాయాలపాలైన మంజుల, అంజలి, అక్షయను స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడం, రక్త స్రావం కూడా ఎక్కువగానే జరగడంతో ఎంజీఎం క్యాజువాలిటీలో అడ్మిట్ చేసి, చికిత్స అందిస్తున్నారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

స్పాట్ ను విజిట్ చేసిన ఎస్పీ…

దుర్ఘటన విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎస్పీ రాంనాథ్ కేకన్, తొర్రూరు డీఎస్పీ సురేష్, సీఐలు, ఎస్సైలు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఓ వైపు నుజ్జునుజ్జు అయిన ఆటో, ఢీకొట్టిన కారు పరిస్థితిని పరిశీలించారు. రహదారి మొత్తం భయానకంగా మారడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం రహదారిని పరిశీలించారు. 

స్థానిక పోలీసులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. తరచూ వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరుగుతుండటంతో వాటి నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా స్థానిక పోలీసులను ఆదేశించారు. మరోసారి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం