తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

HT Telugu Desk HT Telugu

01 May 2024, 12:20 IST

google News
    • Medak Accident: మూడుముళ్ల బంధం మూణ్ణాళ్ళ ముచ్చటయింది. పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో  వరుడు మృతి చెందగా వధువుకు తీవ్ర గాయాలయ్యాయి.
పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Medak Accident: మూడు ముళ్ల బంధం మూణ్ణాళ్ళ ముచ్చటయింది. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన నవ దంపతులను చూసి విధి పగ బట్టింది. వారు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ బైక్ ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో Road accident వరుడు మృతి చెందగా, వధువుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ రెండు కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా చిన్న శంకరంపేటమండలం జంగరాయికి చెందిన ఎర్రోళ్ల వెంకటేష్ (24) కు మాసాయిపేట మండలం పోతానపల్లి గ్రామానికి చెందిన శ్రీలతతో మూడు రోజుల కిందట ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత సంతోషంగా రిసెప్షన్ జరుపుకున్నారు.

లారీ వెంకటేష్ ముఖం, తలపై వెళ్లడంతో …

వివాహ వేడుకలు ముగిసిన అనంతరం అత్తగారింట్లో నిద్ర చేయడానికిి కొత్త పల్సర్ బైక్‌పై దంపతులిద్దరూ సోమవారం రాత్రి జంగరాయి నుండి పోతనపల్లికి బయల్దేరారు. అదే చివరి రాత్రి అయితదని వారు ఊహించలేకపోయారు.

ఈ క్రమంలో మార్గమధ్యలో రామంతాపూర్ జాతీయ రహదారి వద్దకు చేరుకోగానే, రామాయంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న బైక్ ను వెనక నుండి ఢీకొట్టింది.

దీంతో బండి అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా అతడి ముఖం,తలపై నుండి లారీ వెళ్లడంతో తల పగిలి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆమెను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించి నిండు ప్రాణం బలైయ్యిందని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడు వెంకటేష్ తన సోదరుడితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ,ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనతో ఆ పెళ్లింట కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో మిన్నంటాయి. మృతుడు వెంకటేష్ తల్లి సౌందర్య పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు …

స్నేహితుని కుమార్తె పెళ్ళికి వెళ్లి వస్తుండగా ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చార్మినార్ కు చెందిన మచ్చేందర్ (50) వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.

అతడు నారాయణఖేడ్ లో జరిగే స్నేహితుడి కుమార్తె వివాహం వివాహానికి హాజరై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇస్నాపూర్ గురుకుల సమీపంలోకి రాగానే అతడి బైక్ ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

(రిపోర్టింగ్‌ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం