తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kaleshwaram Project : కాళేశ్వరంలో మళ్లీ మొదలైన జల సవ్వడులు

Kaleshwaram Project : కాళేశ్వరంలో మళ్లీ మొదలైన జల సవ్వడులు

HT Telugu Desk HT Telugu

20 December 2022, 23:26 IST

google News
    • Kaleshwaram Project : గోదావరి వరదతో దెబ్బతిన్న కాళేశ్వరంలో మళ్లీ నీటి ఎత్తిపోతల ప్రారంభమైంది. యుద్ధ ప్రాతిపదికన మోటార్లను సిద్ధం చేసిన అధికారులు.. ఎత్తిపోతలను మొదలుపెట్టారు. లక్ష్మీ పంప్ హౌస్ లో మూడు మోటార్లు నిర్వహణలోకి వచ్చాయి. 
లక్ష్మీ పంప్ హౌస్
లక్ష్మీ పంప్ హౌస్

లక్ష్మీ పంప్ హౌస్

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ జల సవ్వడులు మొదలయ్యాయి. ఈ ఏడాది జూలైలో గోదావరికి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టులోని పంప్ హౌస్ లు నీట మునిగాయి. మోటార్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రాజెక్టు చేపట్టిన తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. కొంత మంది నిపుణులు సైతం నిర్మాణాల్లో లోపాలు ఉన్నాయని ఎత్తి చూపారు. అయితే.. ఈ ఆరోపణలను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ... మరమ్మతులను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించాయి. పాడైన పంప్ హౌస్ లు, మోటార్లను తిరిగి నిర్వహణలోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మండలంలోని లక్ష్మీ పంప్ హౌస్ లో (మేడిగడ్డ) ఆదివారం రెండు పంపులను ప్రారంభించిన ఇంజినీర్లు... మంగళవారం మరో పంపుని నిర్వహణలోకి తెచ్చి.. నీటిని ఎత్తి పోశారు. దీంతో.. దిగువ నుంచి ఎగువ వరకు ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్లైంది.

జూలైలో వచ్చిన భారీ వరదతో లక్ష్మీ పంప్ హౌస్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. రక్షణ గోడ కూలి వరద చేరడంతో.. పంపులు, మోటార్లు నీటిలో మునిగి దెబ్బతిన్నాయి. ఇందులో మొత్తం 17 మోటార్లు ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రక్షణ గోడ నిర్మించి... నీటిని మొత్తం తోడేశారు. రేయింబవళ్లు శ్రమించి 8 మోటార్లను సిద్ధం చేశారు. ఇందులో తాజాగా మూడింటిని ప్రారంభించి.. నీటి ఎత్తిపోతలను షురూ చేశారు. ఈ పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసిన నీరు గ్రావిటీ ద్వారా.. సరస్వతీ ( అన్నారం) బ్యారేజీకి చేరుతుంది. ఈ బ్యారేజీకి సమీపంలోని సరస్వజీ పంప్ హౌస్ కూడా వరద ధాటికి మునిగిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 12 మోటార్లు ఉండగా.. ఇప్పటికే నాలుగుంటికి మరమ్మతులు పూర్తి చేసి నీటిని ఎత్తి పోస్తున్నారు. లక్ష్మీ, సరస్వతీ బ్యారేజీలు సిద్ధమవడంతో.. మేడిగడ్డ నుంచి పై స్థాయికి నీటిని ఎత్తి పోసేందుకు వీలు కలిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టు తిరిగి నిర్వహణలోకి రావటంతో.. ఈ ఏడాది యాసంగి సీజన్ కు దాదాపు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. యాసంగి పంటలకు సంబంధించి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కింద రెండో దశ ఆయకట్టుకి పంట చివర్లో సాగు నీరు అవసరం ఉంటుందని.. ఆ మేరకు అవసరాలను లిఫ్ట్ చేసిన నీటి ద్వారా తీరుస్తామని చెబుతున్నారు. సూర్యాపేట తదితర జిల్లాల్లో చివరి ఆయకట్టుకూ పంట ఆఖరిదశలో సాగునీటి ఇబ్బందులు తీరిపోయినట్లేనని అంటున్నారు.

తదుపరి వ్యాసం