Tgpsc Group2: గ్రూప్-2 పరీక్షకు హాజరైన వారి కంటే గైర్హాజరైన వారే ఎక్కువ... వెలిచాలకు సంబంధించి రెండు ప్రశ్నలు
17 December 2024, 5:48 IST
- Tgpsc Group2: కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరీక్షకు హాజరైన వారి కంటే హాజరు కాని వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలి రోజు 49.22శాతం,రెండోరోజు 49శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
తెలంగాణ గ్రూప్2 పరీక్షల్లో వెలిచాల జగపతి రావుకు గుర్తింపు
Tgpsc Group2: తెలంగాణ గ్రూప్ 2పరీక్షలు కరీంనగర్‌లో ప్రశాంతంగా ముగిశాయి. నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించకపోవడంతో పదుల సంఖ్యలో అభ్యర్థులు వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్‌లో రెండో రోజు పరీక్షలకు 49శాతం హాజరయ్యారు. 50 శాతం కంటే తక్కువ మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
దివ్యాంగుల కోసం కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. వందమందికి పైగా గ్రూప్ తో పరీక్షకు దివ్యాంగులు దరఖాస్తు చేసుకోగా 50 మంది మాత్రమే హాజరయ్యారు. దివ్యాంగుల పరీక్షా కేంద్రాన్ని కరీంనగర్ కలెక్టర్ ప్రమీల సత్పతి సందర్శించి పరిశీలించారు.
రెండు రోజులపాటు రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 783 పోస్టులకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహించగా ఐదు లక్షల 51 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ రెండు రోజులపాటు రెండు సెషన్స్ లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు 50 శాతం మంది మాత్రమే హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరీక్ష ఫలితాలను మార్చిలోగా ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేష్ ప్రకటించారు.
వెలిచాల జగపతిరావుపై గ్రూప్–2లో రెండు ప్రశ్నలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్–2 పరీక్షలో కరీంనగర్ కు చెందిన వెలిచాల జగపతిరావు పేరును ప్రస్తావించడం అరుదైన విషయం. వెలిచాల జగపతి రావు పేరు మీద గ్రూప్ 2లో రెండు ప్రశ్నలు వచ్చాయి. నాలుగో పేపర్ లో 52వ ప్రశ్నగా ‘ఎవరి ఆధ్వర్యంలో ‘తెలంగాణ శాసన సభ్యుల ఫోరం’ ఏర్పడింది అని ప్రశ్న అడిగారు.
తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో 1992లో వెలిచాల జగపతిరావు కన్వీనర్ గా, జానారెడ్డి చైర్మన్ గా తెలంగాణ శాసన సభ్యుల ఫోరాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు చెందిన 92 మంది ఎమ్మెల్యేల సంతకాలతో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుకు వినపతిపత్రం సమర్పించారు. అలాగే 55వ ప్రశ్నగా ‘వెలిచాల జగపతి రావుకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి అనే ప్రశ్న ఇచ్చారు.
1989 లో ఆయన కరీంనగర్ లో తెలంగాణపై మూడు రోజుల సదస్సు నిర్వహించడం, దుశర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జల సాధన సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ఆయనకు సంబంధించి వ్యాఖ్యల్లో సరైనవని ఆయన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జీ వెలిచాల రాజేందర్ రావు వెల్లడించారు.
1989లో తెలంగాణ ఆవశ్యకతపై మూడు రోజుల సదస్సు నిర్వహించి మలిదశ ఉద్యమానికి తన తండ్రి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. గ్రూప్ 2లో ప్రశ్నలు ఇవ్వడం ద్వారా తన తండ్రి త్యాగాన్ని, ఆయన పోరాట చరిత్రను ఈ తరానికి తెలియజేసినందుకు టీజీపీఎస్సీ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి జగపతిరావు ప్రముఖంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
1972-77 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ అత్యుత్తమ సేవలందించారు. 1972లో జగిత్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-84 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పని చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు నీతికి నిజాయితీకి మారుపేరని తెలిపారు.
1989లో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటులో కీలకం..
1989లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినా అధిష్టానం ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార గుర్తుపై గెలిచి సంచలనం సృష్టించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా తెలంగాణ లెజిస్ట్రేచర్స్ ఫోరం కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. చైర్మన్ గా జానారెడ్డి వ్యవహరించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా చేపట్టి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
1969 తెలంగాణ ఉద్యమంలో కీలక భూ మిక పోషించిన జగపతిరావు కవిగా సుపరిచితులు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఎట్లా వివక్షతకు గురవుతుందో గణాంకాలతో వివరిస్తూ పలు దిన పత్రికలకు ఆర్టికల్స్ రాశారు. ప్రజలను చైతన్యవంతులను చేశారు. 1989లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య ఎమ్మెల్యేగా జగపతిరావు గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలోనే తెలంగాణ శాసనసభ్యుల ఫోరానికి అంకురార్పణ జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో జగపతిరావు సీనియర్ నేతగా ఉన్నప్పటికీ టికెట్ దక్కని కారణంగా ఇండిపెండెంట్‌గా గెలుపొంది సత్తా చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా జగపతిరావు మీద పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్ష, అవమానం, అణచివేతకు తెలంగాణ ప్రాంతం గురవుతున్నదనే భావన జగపతిరావులో ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ స్టేట్‌ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడంతో జగపతిరావు రగిలిపోయేవారు. పె
ద్ద మనుషుల ఒప్పందం, ఆరుసూత్రాలు, అష్ట సూత్రాలు వంటి ఒప్పందాలు అమలు కావాలంటే తెలంగాణ శాసనసభ్యులందరం ఒకే వేదిక మీదకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ ఫోరం ఏర్పాటులో జగపతిరావు పాత్ర అమోఘం. జానారెడ్డి, జువ్వాడి చొక్కారావు, పి.నర్సారెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, ఎం. బాగారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎం నారాయణరెడ్డి, ఎం. సత్యనారాయణరావు, ఎన్.ఇంద్రసేనారెడ్డి, సీహెచ్.విద్యాసాగర్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి భిన్న పార్టీల సభ్యులు తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటుకు సహకరించారు.
ఆ సయయంలో ఫోరం కన్వీనర్‌గా జగపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యుల సహకారంతో తెలంగాణ ప్రాంత హక్కులు, రక్షణ, నీళ్లు, నిధుల్లో వాటాల కోసం శాసనసభ లోపల, బయటా సమష్టిగా పోరాడారు. జగపతిరావు కవి, సాహితీవేత్త. లోతైన అధ్యయనం చేసి, తన కవిత్వం.. రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. సోమవారం నిర్వహించిన గ్రూప్ 2లో జగపతిరావుపై రెండు ప్రశ్నలు ఇవ్వడం అరుదైన రికార్డుగా నమోదైంది.
జగపతి రావు త్యాగం, ఆయన పోరాట పటిమ చరిత్రను గుర్తించడం టీజీపీఎస్సీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. జగపతిరావు పోరాటంపై కళ్లకు కట్టినట్లు ప్రశ్నలు సంధించడం విశేషం. 2022 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన ఆ మహానేత జగపతిరావు తుది శ్వాస విడిచారు.