తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly Polls 2023 : సందిగ్ధంలో పొత్తు ..! అయోమయంలో 'కామ్రేడ్లు'

Telangana Assembly Polls 2023 : సందిగ్ధంలో పొత్తు ..! అయోమయంలో 'కామ్రేడ్లు'

HT Telugu Desk HT Telugu

14 October 2023, 13:24 IST

google News
    • Telangana Assembly Polls 2023: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. కొద్దిరోజులుగా చర్చల దశలోనే ఉన్న నేపథ్యంలో…. వామపక్ష పార్టీల కేడర్ అయోమయంలో ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

Telangana Assembly Polls 2023: తెలంగాణ రాష్ట్ర శాసన సభకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు కూడా విడుదలైంది. కానీ.. ఇంకా కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు పొడవలేదు. పొత్తు కుదురుతుంది.. రేపో మాపో స్థానాలు ఖరారు అవుతాయని ఎదురు చూస్తున్న వామపక్ష పార్టీల కేడర్ అయోమయానికి గురవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను ఇంకా ప్రకటించకపోవడం, అసలు ఎన్ని సీట్లు కేటాయిస్తారు..? ఏ ఏ సీట్లు ఇస్తారో ఇదే విధంగా ఇంకా ఓ అభిప్రాయానికి రాకపోవడంతో సీపీఎం, సీపీఐ శ్రేణులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిని గద్దె దించేందుకు కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన ‘ ఇండియా ’ కూటమిలో వామపక్ష పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో కలిసి నడుస్తున్నందున రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలన్న అభిప్రాయంతో ఇక్కడ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలు ఎన్నికల పొత్తుకు వెళ్ళనున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ పార్టీల పొత్తు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

బీఆర్ఎస్ తో ముడిపడిన వామపక్ష బంధం

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని శక్తి యుక్తులు ప్రధర్శించింది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ టికెట్ పై బరిలో నిలిచారు. బీజేపీలో ఓడగొట్టాలన్న ఏకైక లక్ష్యంతో సీపీఎం, సీపీఐలు కాంగ్రెస్ తో కాకుండా అధికార బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి తమ వంతు పాత్ర పోషించాయి. బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు శాసన సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కానీ, అన్ని పార్టీల కంటే ముందుగానే ఏక కాలంలో 115 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినాయకత్వం వాపమపక్షాలతో ఎలాంటి పొత్తు లేదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. దీంతో కొత్త దారులు వెదుక్కోవడం వామపక్షాల వంతు అయ్యింది.

కాంగ్రెస్ వైపు అడుగులు

ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో కలిసి నడవనుండడతో తెలంగాణలోనూ పొత్తుపై ఆశలు పొడిచాయి. సీపీఎం, సీపీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు పార్టీలు చెరో మూడు స్థానాలను కోరతున్నాయి. మూడు కుదరని పక్షంలో రెండు ఎమ్మెల్యే స్థానాలతో పాటు, ఒక ఎమ్మెల్సీ పదవి కోసం పట్టుబడుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలలో బలంగా ఉన్న ఈ రెండు పార్టీలూ ఇక్కడనే ఎక్కువ సీట్లు అడుగుతున్నాయి. వామపక్షాలు అడుగుతున్న సీట్లు కాంగ్రెస్ కూ కీలకమైనవే కావడం, అక్కడ ఆ పార్టీ టికెట్ల కోసం సీనియర్లే పట్టుబడుతుండడతో వామపక్షాలతో పొత్తు ఓ కొలిక్కి రావడం లేదని చెబుతున్నారు.

సీపీఎం ఏం కోరుతోంది..?

సీపీఎం ఈ ఎన్నికల్లో భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడెం స్థానాలను కోరుతోంది. అయితే, భద్రాచలంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. సిట్టింగ్ సీటు అయినందున తమ ఎమ్మెల్యేను అందునా ఎస్టీ రిజర్వుడు స్థానంలో ఎలా మార్చాలన్న అంశం కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. కుదరితే పొదెం వీరయ్యను పినపాకకు మార్చాలన్న ప్రతిపాదన కూడా వచ్చినట్లు సమాచారం. ఆయన ఇప్పటికే ములుగు నుంచి భద్రాచలం వలస వచ్చారు. మరో మారు మార్చడం ఎలా అన్న అంశం పై చర్చ జరుగుతోంది. కాబట్టి కాంగ్రెస్ భద్రాచలం ను వదులుకోవడానికి సిద్దంగా లేదంటున్నారు. ఖమ్మం జిల్లాలోని మరో సీటు పాలేరుపైనా ఇదే పరిస్తితి నెలకొని ఉంది. పాలేరు నుంచి బరిలోకి దిగడానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య పోటీ ఉంది. ఈ ఇద్దరిని కాదని పాలేరును సీపీఎం ఎలా కేటాయించాలో కూడా కాంగ్రెస్ నిర్ణయించుకోలేక పోతోందని అంటున్నారు. తుమ్మల నాగేశ్వర్ రావును ఖమ్మం కు కేటాయించి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కొత్తగూడెం కు కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న చర్చ జరిగినా.. సీపీఎం కోరుతున్న స్థానాల్లో కొత్తగూడెం ఉండడం మరో కొత్త సమస్యకు తెరలేపుతోంది. పొంగులేటిని పార్లమెంటుకు పంపితే సమస్య పరిష్కారం అవుతుందన్న చర్చ జరిగినట్లు సమాచారం.

సీపీఐ కోరుతున్న సీట్లు ..?

సీపీఐ కూడా తమకు మూడు సీట్లు కేటాయించాలని కోరుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో సీపీఐ కార్యదర్శి కూనంనేని సాబంశివారావు నారాజు అయ్యారని అంటున్నారు. ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు హుస్నాబాద్ సీటుకు కాంగ్రెస్ లోనే బాగా పోటీ ఉంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీపీఐకి సీటు ఎలా కేటాయించాలన్న అంశంపై తర్జన భర్జన జరుగుతోందంటున్నారు. సీపీఎం మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ సీటును ఆశిస్తున్నారు. హుస్నాబాద్ ను కేటాయించలేని పక్షంలో మునుగోడును ఇవ్వాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ లో చర్చ జరిగిందని సమాచారం. గతంలో ఇక్కడి నుంచి సీపీఐ పలు మార్లు ప్రాతినిధ్యం వహించింది. కానీ, ఇపుడు సీపీఐ మునుగోడుపై పెద్దగా పట్టు పట్టడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే.. వామపక్షాలతో పొత్తు విషయంలో కాంగ్రెస్ లోనూ కొందరు సీనియర్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా.. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉంటుందని, సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సిందేనని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ కారణంగానే పొత్తు, సీట్ల కేటాయింపు వంటి విషయాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ )

తదుపరి వ్యాసం