Medak Crime: ఎయిర్‌టెల్ బేస్ బాండ్ యూనిట్ల చోరీ..అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
19 January 2024, 13:00 IST
- Medak Crime: ఎయిర్ టెల్ సెల్ టవర్ ల వద్ద విలువైన బేస్ బాండ్ యూనిట్లు దొంగిలించి ఢిల్లీ,బాంగ్లాదేశ్ లకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎయిర్‌టెల్ బేస్ బాండ్ యూనిట్లు
Medak Crime: మెదక్ జిల్లా చేగుంట మండలం రామంతాపూర్, రాంపూర్ పరిధిలోని ఎయిర్ టెల్ సెల్ టవర్ ల వద్ద ఉన్న బేస్ బాండ్ యూనిట్లు చోరీకి చోరీకి గురయ్యాయని, ఈ నెల 13 న సెల్ టవర్ పెట్రోలింగ్ ఉద్యోగి నాగరాజు చేగుంట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఓ కారు చేగుంట ప్రాంతంలో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించి,కారు నెంబర్ ఆధారంగా అది మాసాని మహేష్ దని తేల్చారు. కారులో వచ్చిన వారిపై అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించగా అసలు నిజం బయటపడింది.
11మంది ముఠాగా ఏర్పడి చోరీలు…
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం వెంకంపల్లి గ్రామానికి చెందిన మాసాని మహేష్ ఎయిర్ టెల్ బేస్ బాండ్ యూనిట్ల సప్లయర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన మహేష్ సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో వాటిని అపహరించాలని నిర్ణయించుకున్నాడు.
అతనితో పాటు నాగిరెడ్డి పేట మండలం తాండూర్ కు చెందిన కాయిదంపూర్ సంతోష్ రెడ్డి, గోవురి రత్నాకర్ రెడ్డి, రాఘవపల్లి కి చెందిన కర్రోళ్ల రాజా గౌడ్ తో కలిసి మొత్తం 11 మంది ముఠా గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
ప్రధాన నిందితుడు మహేష్ బేస్ బాండ్ యూనిట్ల సప్లయర్ కావడంతో సులువుగా దొంగతనం చేసి విక్రయించడం అలవాటు చేసుకున్నాడు . వీరి నుండి దొంగిలించిన యూనిట్లను హైదరాబాద్ కు చెందిన మాసాని అనిల్, మహ్మద్ అఫ్రోజ్, కామారెడ్డి కి చెందిన అశోక్ అనే ముగ్గురు కలిసి తక్కువ ధరకు ఢిల్లీ, బంగ్లాదేశ్ లలో విక్రయించే వారని తెలిపారు.
పరారీలో ఉన్ననలుగురు నిందితులు...
వీరంతా సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ పరిధుల్లో సంవత్సరం నుండి ఎయిర్ టెల్ బేస్ బాండ్ యూనిట్ల దొంగతనం చేస్తున్నట్లు వివరించారు.
నిందితులపై అన్ని జిల్లాల్లో కలిపి 26 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బేస్ బాండ్ యూనిట్ల విలువ 5జీ విలువ రు. 3నుంచి 5లక్షలు, 4జీ విలువ రు. 2నుండి 4లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వీరి నుండి రు. 6. 75లక్షల విలువైన సామాగ్రి, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
చోరీలకు పాల్పడిన వారిలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అతితక్కువ సమయంలో కేసును చేధించిన తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి ,రామాయంపేట సీఐ,తూప్రాన్,చేగుంట ఎసై లను మెదక్ ఎస్పీ అభినందించారు.