Sangareddy Suicide Attempt: పోలీసులు ఫోన్ లాక్కున్నారని పెట్రోల్ పోసుకున్నాడు…
02 February 2024, 9:42 IST
- Sangareddy Suicide Attempt: పోలీసులు ఫోన్ లాక్కున్నారని, ఒంటిపై పెట్రోల్ పోసుకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నిప్పంటించుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
ఆస్పత్రిలోచికిత్స పొందుతున్న సంతోష్
Sangareddy Suicide Attempt: పోలీసులు తన ఫోన్ లాక్కున్నారనే క్షణికావేశంలో ఒక వ్యక్తి తన పైన పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్న సంచలన సంఘటన సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జరిగింది.
సంగారెడ్డి చౌరస్తాలో సంగారెడ్డి ట్రాఫిక్ పోలీసులు గురువారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో బస్సు దిగిన ఎన్.సంతోష్ (45) అనే వ్యక్తి పోలీసులను ఫోటోలు, వీడియోలు తీయడం ప్రారంభించాడు. తను వీడియోలు తీయడం గమనించిన పోలీసులు, వీడియోలు ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించడంతో సరైన సమాధానం చెప్పలేకపోయాడు.
వారించినా వీడియోలు తీస్తూ…
వద్దని వారించినా వినకుండా సంతోష్ వీడియోలు తీయటంతో పోలీసులు ఫోన్ లాక్కున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో సంతోష్ దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ లో ఒక సీసాలో పెట్రోల్ కొనుక్కొని, మళ్లీ పోలీసులు దగ్గరకు వచ్చి తన మీద పోసుకొని నిప్పంటించుకున్నాడు.
మంటలు అంటుకోవడంతో అక్కడున్న వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే కొంతమంది యువకులు పక్కనున్న బట్టల షాప్ నుండి, కొన్ని దుస్తువులు తెచ్చి అతడిని కాపాడారు . అప్పటికే సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత, సంతోష్‌ను అంబులెన్సు లో సంగారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
60 శాతం గాయాలు…
సంతోష్ కు 60 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు తెలిపారు. సంతోష్ రాజంపేట ప్రాంతంలో ఉంటూసిద్దిపేట జిల్లాలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
సిద్దిపేట డ్యూటీకి వెళ్లిన సంతోష్, పోతిరెడ్డి పల్లి చౌరస్తా దగ్గర బస్సు దిగగానే సంగారెడ్డి ఎస్సై చెంద్రశేఖర్, తన సిబ్బందితో కలిసి, డ్రంక్ అండ్ డ్రైవ్, మిగతా ట్రాఫిక్ ఉల్లంఘనలు చెక్ చేస్తూ ఫైన్ లు వేస్తుండటాన్ని వీడియో తీయడంతో ఫోన్ లాక్కున్నామని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు పెట్రోల్ బంక్ వైపు వెళ్తున్న విషయాన్ని, బాటిల్ లో పెట్రోల్ తెచుకున్న ధీ పోలీసులు గమనించలేదు. సంతోష్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్న తర్వాత పోలీసులు, స్థానికులు గమనించామని చెబుతున్నారు.
ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో మద్యం మత్తులో ఉన్నాడా, మరేదైనా కారణం ఉందా అని ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. సంతోష్ పనిచేస్తే తప్ప, కుటుంబానికి పూట గడవదని అతని భార్య వాపోయింది.