Deadbody in Manjeera: మంజీరా నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం.. హత్యగా నిర్థారణ
06 February 2024, 7:06 IST
- Deadbody in Manjeera: మంజీరా నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. మహిళను హత్యచేసి మూటగట్టి నీటిలో పడేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.
మంజీరా నదిలో బయటపడిన మహిళ మృతదేహం
Deadbody in Manjeera: మంజీరా నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. మహిళను హత్యచేసి నీటిలో పడేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సిరూర్ గ్రామ సమీపంలోని మంజీరా నదిలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరూర్ గ్రామ శివారులో ఉన్న మంజీరా నదిలో ఉదయం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు.
చేపలు పడుతుండగా వారికి నదిలో ఓ మృతదేహం ఉన్నట్టు గుర్తించి,దానిని ఒడ్డుకు చేర్చారు . వెంటనే మత్స్యకారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ రఘు,జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశం సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతురాలికి 25-30 ఏళ్ల మధ్య వయస్సు ఉండొచ్చని భావిస్తున్నారు. యువతీ ఒంటిపై రెడ్ కలర్ నైటీ ఉందని తెలిపారు. మృతురాలిని కాళ్ళు,చేతులు కట్టేసి దుండగులు ఎక్కడో దారుణంగా హత్యచేసి రగ్గులో లో చుట్టి మృతదేహం నీటిలో పైకి తేలకుండా దానికి పెద్ద బండరాయిని కట్టేసి మంజీరా నదిలో నీటిలో పడేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.
నీటిలో పడేసి ఎక్కువ రోజులు కావడంతో మృతదేహం గుర్తు పట్టరాని విధంగా మారింది. పోలీసులు ఆధారాల కోసం క్లూస్ టీం ని రప్పించి మృతదేహాన్ని పరిశీలించి పలు వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుదాఘాతం తో వివాహిత మృతి...
పెళ్లి అయ్యి సంవత్సరం కూడా నిండకముందే విద్యుదాఘాతంతో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మాసానిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మాసానిపల్లి గ్రామానికి చెందిన నవీన్ కు, బంటు పవిత్ర (20) తో 10 నెలల కింద వివాహం జరిగింది. అన్యోన్యంగా ఉంటున్న ఆ దంపతుల మధ్య కరెంట్ రూపంలో మృతువు కబళించింది.
పవిత్ర స్నానం చేయడానికి బకెట్ లో నీళ్లు పెట్టి వాటర్ హీటర్ పెట్టింది. అనంతరం నీళ్లు వేడయ్యాక హీటర్ తీస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది. ఇది గమనించిన ఆమె భర్త నవీన్ హీటర్ ప్లగ్ ను తొలగించాడు.
అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన పవిత్రను హుటాహుటిన జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పవిత్ర మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లితండ్రులు,బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
పవిత్ర మృతదేహాన్నిపట్టుకొని ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతురాలి తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
(ఉమ్మడి జిల్లా మెదక్ ప్రతినిధి)