Murder Case Accused: రిమాండ్ ఖైదీ పరారీతో పోలీసులకు తిప్పలు
20 December 2023, 9:12 IST
- Murder Case Accused: భార్య హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు చుక్కలు చూపించాడు. కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకురాగా.. వారి కళ్లుగప్పి తప్పించుకు పారిపోయాడు. దాదాపు నెలరోజుల పాటు చుక్కలు చూపించి.. ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కాడు.
పోలీసుల కళ్లు గప్పి పారిపోయిన రాజు
Murder Case Accused: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఆలకుంట రాజు–గట్టమ్మ(31) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. రాజు తరచూ గట్టమ్మతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే 2019 ఆగస్టు 7వ తేదీన మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో గట్టమ్మను ఆమె భర్త రాజు కర్రతో బలంగా తలపై కొట్టడంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విషయం తెలిసిన అనంతరం గట్టమ్మ తండ్రి వల్లెపు వెంకటయ్య అదే రోజు ధర్మసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి.. నిందితుడు రాజుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి ఖమ్మం జైలుకు తరలించారు.
ఖాకీల కళ్లుగప్పి జంప్
గత నెల నవంబర్ 16న ఆలకుంట రాజును హనుమకొండ జిల్లా కోర్టులో హాజరు పరిచేందుకు ఏఆర్ ఎస్సై బి.నర్సింహులు, మరో కానిస్టేబుల్ తీసుకుని వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో కోర్టులో హాజరు పరిచి, బయటకు తీసుకు వచ్చారు.
ఖమ్మం జైలుకు తీసుకెళ్లేందుకు కోర్టు నుంచి రాజును బయటకు తీసుకురాగా.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలీసుల కళ్లుగప్పి రాజు సైలెంట్ గా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఏఆర్ ఎస్సై బి.నర్సింహులు స్థానిక సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పోలీసుల తప్పించుకున్న రాజు.. వివిధ ప్రాంతాలు తిరిగి చివరకు హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రాజు తప్పించుకోవడంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆయన కోసం నవంబర్ 16 నుంచి గాలిస్తూనే ఉన్నారు.
కేసును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు బదిలీ చేయగా.. వారు ఎంక్వైరీ ప్రారంభించారు. ఈ మేరకు రాజు హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళవారం టాస్క్ ఫోర్స్ సీఐ పవన్ కుమార్, ఎస్సై నరసింహ అక్కడికి వెళ్లి రాజును పట్టుకున్నారు.
అనంతరం తదుపరి విచారణ నిమిత్తం సుబేదారి పోలీసులు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచి మళ్లీ ఖమ్మం జైలుకు తరలించారు. కాగా తప్పించుకు తిరుగుతున్న రాజు పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ పవన్ కుమార్, ఎస్సై నరసింహను టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ అభినందించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)