Kidnap Drama: కిడ్నాప్ ఒట్టిదే! దొరికిపోతాననే భయంతో బాలిక డ్రామా..
07 July 2023, 9:48 IST
- Kidnap Drama: హయత్ నగర్‌లో కలకలం సృష్టించిన కిడ్నాప్ వ్యవహారం డ్రామాగా తేల్చారు. బాలిక ఇష్ట పూర్వకంగానే సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకుడితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో అసలు నిజం బయటపడింది.
హయత్ నగర్ కిడ్నాప్ డ్రామాగా తేల్చిన పోలీసులు
Kidnap Drama: హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందరిని హడలెత్తించిన ఈ వ్యవహారంలో అసలు కిడ్నాప్ జరగలేదని పోలీసులు నిర్ధారించారు.పెద్ద అంబర్‌పేట్‌లో నివసించే బాలిక మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. అడ్రస్ తెలుసుకునే నెపంతో ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి బైక్ మీద .. ఔటర్ రింగు రోడ్డు దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు వార్తలు వెలువడ్డాయి. వారిని ప్రతిఘటించి రోడ్డు పైకి పరుగెత్తుకుంటూ వచ్చి అటుగా వచ్చిన హిజ్రాను సాయం అడగటంతో.. ఆమె బాలిక కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
దీంతో పోలీసులు ఆగమేఘాలపై దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే స్పందించిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించి తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేశారు. చివరకు దర్యాప్తులో బాలిక చెప్పిందంతా కేవలం కట్టు కథగా తేల్చేశారు.
కిడ్నాప్ డ్రామా ఆడిన బాలికకు కొద్ది రోజుల కిందట స్నాప్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. స్నాప్ చాట్‌లో ఇద్దరూ ఫొటోలు పంపించుకున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య చనువు పెరగడంతో బయట కలుసు కోవాలనుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో బాలిక ఒంటరిగా బయటికి రావడంతో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆ యువకడు బైక్ మీద వచ్చాడు. అతనితో కలిసి శివార్లకు వెళ్లింది.
ఈ క్రమంలో వాళ్లిద్దరు ఉన్న సమయంలో హిజ్రా అటుగా రావడాన్ని గమనించి కంగారు పడ్డారు. వెంటనే బాలిక అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించడంతో కాలికి గాయమైంది. దీంతో బెదిరిపోయిన ఆమె తనను కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్లు చెప్పింది. తనను కాపాడాలని ప్రాధేయపడటంతో హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఘటనా స‌్థలికి పోలీసులు కూడా మొదట ఆమె చెప్పింది పూర్తిగా నమ్మేశారు. విచారణలో అసలు నాటకం బయటపడింది. బాలికను బయటకు తీసుకు వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక చెట్ల పొదల నుంచి రావడం వల్ల చిన్న చిన్న గాయాలయ్యాయని, ఆమెకు వైద్య పరీక్షలు చేయించామని లైంగికదాడి జరగలేదని డీసీపీ తెలిపారు.