Karimnagar Land mafia: కరీంనగర్‌లో అక్రమాలకు పాల్పడిన ధరణి మాజీ కోఆర్డినేటర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
11 April 2024, 13:27 IST
- Karimnagar Land mafia: రెవెన్యూ, పోలీస్ అధికారుల అండదండలతో కరీంనగర్ లో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. అధికారుల అండతో అమాయకుల భూములను కొల్లగొట్టారు.
కరీంనగర్‌లో ధరణి మాజీ కో ఆర్డినేటర్ అరెస్ట్
Karimnagar Land mafia: ధరణి Dharaniలో అక్రమాలకు పాల్పడిన వారి పాపం పండుతోంది. కరీంనగర్‌లో అక్రమాలకు పాల్పడిన land mafiaవారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అక్రమదందాలో ప్రత్యక్షంగా పరోక్షంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు భాగస్వామ్యం అయ్యారు.
భూ అక్రమ Land grabbing దందాలపై కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అరెస్టులు చేస్తుండడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుంది.
విదేశాలకు పారిపోయే పనిలో నిమగ్నంకావడంతో లుక్ ఔట్ నోటీస్ లు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. రెండు నెలల వ్యవధిలో సిపి కార్యాలయానికి వెయ్యికి పైగా పిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై సిపి ప్రత్యేకంగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పేరుతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఏసిపి స్థాయి అధికారిచే విచారణ జరిపిస్తున్నారు.
ఆధారాలు సేకరించి ఇప్పటికే పదిమంది కార్పోరేటర్ లు, మహిళా కార్పేరేటర్ భర్త, ఓ జెడ్పీటీసీ భర్తతో సహా.. ఓ తహశిల్దార్ ను 30 మంది భూ కబ్జాదారులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఓ సిఐ తో సహా రెవెన్యూ ఉద్యోగులు ముగ్గురు సస్పెన్షన్ కు గురయ్యారు.
తాజాగా నకిలీ ధృవ పత్రాలు సృష్టించి తహశిల్దార్ భూ ఆక్రమణలకు సహకరించిన కరీంనగర్ కలెక్టరేట్ లోని ధరణి మాజీ కో ఆర్డినేటర్ ఎల్లంకి బుచ్చిరాజు ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.
నెలక్రితం తహశీల్దార్ అరెస్టు
కొత్తపల్లి తహశీల్దార్ గా పనిచేసిన చిల్లా శ్రీనివాస్ నకిలీ దృవపత్రాలు సృష్టించి రేకుర్తి లో భూఆక్రమణకు పాల్పడడంతో శ్రీనివాస్ తో సహా 12 మందిపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 7న శ్రీనివాస్ తోపాటు ముగ్గురిని అరెస్టు చేయగా 9 మంది పారిపోయారు.
అందులో శ్రీనివాస్ బినామీ అయిన A12 గా ఉన్న భగత్ నగర్ కు చెందిన ఎల్లంకి బుచ్చిరాజు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపిచారు. ఇప్పటికే తహశీల్దార్ శ్రీనివాస్ తోపాటు మరో బినామి విఆర్ఎ ను పోలీసులు కస్టడిలోకి తీసుకుని విచారించారు. శ్రీనివాస్ ఇల్లు, గెస్ట్ హౌస్ లలో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సిఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.
రేషన్ బియ్యం మిల్లుకు తరలించిన కేసులో ముగ్గురు అరెస్టు
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై గోదాం నుంచి నేరుగా రేషన్ షాప్ కు కాకుండా రైస్ మిల్లుకు తరలించిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ లోని గోదాం నుంచి దుర్శేడ్ లోని రైస్ మిల్లుకు తరలించిన రేషన్ డీలర్ అంజయ్య , రైస్ మిల్లు యజమాని సంతోష్ రెడ్డి, ఆటో డ్రైవర్ మధు లను అరెస్టు చేసి 504 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురిపై 6ఏ తోపాటు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ముగ్గురిని జిల్లా జైల్ కు తరలించినట్లు రూరల్ సిఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.
(రిపోర్టింగ్ కేవీ రెడ్డి,కరీంనగర్)