తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Corporation: రోడ్డెక్కిన విలీన గ్రామాల ప్రజలు,కార్పొరేషన్ లో కలపొద్దు -గ్రామ పంచాయితీలే ముద్దు అంటూ ఆందోళన

Karimnagar Corporation: రోడ్డెక్కిన విలీన గ్రామాల ప్రజలు,కార్పొరేషన్ లో కలపొద్దు -గ్రామ పంచాయితీలే ముద్దు అంటూ ఆందోళన

HT Telugu Desk HT Telugu

24 September 2024, 6:02 IST

google News
    • Karimnagar Corporation: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో ఆరు గ్రామపంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఆదిలోనే నిరసన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విలీన గ్రామాలను ప్రజలు కార్పొరేషన్ లో కలుపొద్దు... గ్రామపంచాయతీలే ముద్దు అంటూ రోడ్డెక్కారు.
గ్రామాలను కార్పొరేషన్‌లో కలపొద్దని ప్రజల ఆందోళన
గ్రామాలను కార్పొరేషన్‌లో కలపొద్దని ప్రజల ఆందోళన

గ్రామాలను కార్పొరేషన్‌లో కలపొద్దని ప్రజల ఆందోళన

Karimnagar Corporation: గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని, లేకుంటే కలెక్టరేట్ ను మంత్రి ఇంటిని ముట్టడిస్తామని గ్రామాల ప్రజలు హెచ్చరించారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ కరీంనగర్ గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కరీంనగర్ కు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో ఆరు గ్రామ పంచాయితీలను కార్పొరేషన్ లో కలిపేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. అందుకు సంబంధించిన సిఫార్సు లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో కొత్తపల్లి మున్సిపాలిటీ తో పాటు బొమ్మకల్ దుర్శేడ్, గోపాల్ పూర్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ విలీన గ్రామాల ప్రజలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చింతకుంట, దుర్శేడ్, గోపాల్ పూర్ గ్రామస్థులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పోరుబాట పట్టారు. దుర్శేడ్ వద్ద రాజీవ్ రహదారిపై రెండు గ్రామాల ప్రజలు ధర్నా రాస్తారోకో దిగి మంత్రి పొన్నం ప్రభాకర్ తీరును నిరసించారు. కార్పోరేషన్ వద్దు.. గ్రామ పంచాయితీలే ముద్దు అంటూ ప్ల కార్డ్స్ ప్రదర్శించారు.

ఉపాధి హామీ కోల్పోతాం..

నగర సమీపంలోని గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేస్తే జాతీయ ఉపాధి హామీ కింద పొందే ఉపాధిని కోల్పోతామని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు కావడం లేదని ఇదివరకు నగరంలో విలీనం చేసిన గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని పంట పొలాలతో కళకళలాడే గ్రామాలను కార్పొరేషన్ లో కలుపొద్దని డిమాండ్ చేశారు.

కార్పొరేషన్ లో గ్రామాలను విలీనం చేస్తే కార్పొరేట్ కల్చర్ వచ్చి పచ్చని పంటపొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్ గా మారి వ్యవసాయం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకు కార్పొరేషన్ లో విలీనం చేసిన రాంపూర్, రాంనగర్, పద్మనగర్ ఇప్పటికి అబివృద్దికి నోచుకోలేదన్నారు. పన్నులు పెరిగి సౌకర్యాలు కానరాక అభివృద్ధి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని అందుకే కార్పొరేషన్ లో కలుపొద్దని కోరుతున్నామని తెలిపారు.

మంత్రి పొన్నం కక్ష సాధింపులో భాగమేనా?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి పొన్నం ప్రభాకర్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కరీంనగర్ ను వీడి హుస్నాబాద్ కు మకాం మార్చి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యారు

గతంలో కరీంనగర్ లో తన ఓటమికి కొత్తపల్లితో పాటు నగర సమీపంలోని గ్రామాలే కారణమనే కోపంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కక్ష సాధింపులో భాగంగానే కొత్తపల్లి మునిసిపాలిటీ తో పాటు ఆరు గ్రామపంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు యత్నిస్తున్నాడని రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.‌ మంత్రి పొన్నం తన ఆలోచనను విరమించుకుని కార్పొరేషన్ లో గ్రామాలను విలీనం చేసే ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

మంత్రి ఇంటిని.. కలెక్టరేట్ ను ముట్టడిస్తాం..

కార్పోరేషన్ లో గ్రామాల విలీన ప్రక్రియను ఆపకుంటే మంత్రి పొన్నం ఇంటిని కలెక్టరేట్ ను ముట్టడిస్తామని దుర్శేడ్, గోపాల్ పూర్ గ్రామాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. రెండు గ్రామాల ప్రజలు జేఏసీగా ఏర్పడి రోడ్డెక్కి ఆందోళన దిగి మంత్రికి అధికార యంత్రాంగానికి అల్టిమేటం ఇచ్చారు. గ్రామాల్లో ఉపాధిని, వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. విలీనం పై ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి కలెక్టరేట్ తోపాటు మంత్రి ఇంటిని ముట్టడిస్తామని జేఏసీ ప్రతినిధులు మంద రాయమల్లు, సంపత్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ హెచ్చరించారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం