CM Relief Fraud:సీఎం రిలీఫ్ ఫండ్ కొట్టేసే ప్లాన్ పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి యాజమాన్యం
05 November 2024, 9:46 IST
- CM Relief Fraud: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా అలాంటి ఘటనే వరంగల్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
ఫేక్ బిల్లులతో సిఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు
CM Relief Fraud: పని చేసిన ఆసుపత్రి నుంచే ఫేక్ మెడికల్ బిల్స్ తయారు చేసి, సీఎం రిలీఫ్ ఫండ్ కొట్టేసేందుకు ప్లాన్ చేసిన దుండగుడి గుట్టు రట్టయ్యింది. దాదాపు 23 మంది పేరున ఫేక్ మెడికల్ బిల్స్ తయారు చేసి, సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయగా.. ఆసుపత్రి యాజమాన్యం పసిగట్టి ఆ వ్యక్తిపై సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ నగరంలో కలకలం చెలరేగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
హనుమకొండ సిటీ బాలసముద్రం సమీపంలో డాక్టర్ అంబిక, డాక్టర్ రాజు దంపతులు ఓ హాస్పిటల్ నడిపిస్తున్నారు. అందులో తమకు తెలిసిన డాక్టర్లను నియమించుకుని ఆసుపత్రిని రన్ చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో సీఎం రిలీఫ్ ఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంతవరకు బాగానే ఉండగా.. ఇటీవల సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితా సంబంధిత పోర్టల్ నుంచి ఆసుపత్రి యాజమాన్యానికి అందింది.
దానిని డాక్టర్ అంబిక, రాజు దంపతులు పరిశీలించి చూసి, ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ హాస్పిటల్ లో చికిత్స చేయించుకోకున్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ సాంక్షన్ అయినట్టుగా 9 మంది పేర్లు, అప్రూవల్ పెండింగ్ లో ఉన్నట్టుగా మరో 14 మంది పేర్లు తమ హాస్పిటల్ పేరున ఉండటం గమనించి ఖంగు తిన్నారు.
బయటపడ్డ రిసెప్షనిస్ట్ బాగోతం
తమ హాస్పిటల్ లో అడ్మిట్ కాకున్నా.. అడ్మిట్ అయినట్టుగా, ఐపీ బిల్స్, ఫేక్ ల్యాబ్ రిపోర్టులు, మెడికల్ బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా డాక్టర్ దంపతులు గుర్తించారు. కాగా సీఎంఆర్ఎఫ్ కోసం పంపే బిల్స్ ఆసుపత్రిలో పని చేసే హేమలత పేరుతో ఉన్న ఈమెయిల్ ఐడీ ద్వారా జరుగుండటంతో ముందుగా డాక్టర్ దంపతులు ఆమెను నిలదీశారు.
దీంతో ఆ మెడికల్ బిల్లులు జనరేట్ అయిన సమయంలో తాను డ్యూటీలో లేనని, తన ఐడీ ద్వారా ఎవరో ఫేక్ మెడికల్ బిల్లులు తయారు చేసి ఉండొచ్చని హేమలత అనుమానం వ్యక్తం చేసింది. దీంతో డాక్టర్ దంపతులు మరింత లోతుగా వివరాలు కూపీ లాగడంతో అసలు విషయం బయట పడింది.
ఆసుపత్రిలో కొద్దిరోజుల కిందటి వరకు తాడ్వాయి మండలం ఎస్టీ తండాకు చెందిన మాలోత్ యాకూబ్ అనే వ్యక్తి రిసెప్షనిస్ట్ గా పని చేయగా.. ఆ వ్యక్తి ద్వారానే ఫేక్ బిల్లులు జనరేట్ అయినట్టుగా గుర్తించారు. మొత్తంగా 23 మంది పేరున ఫేక్ బిల్లులు తయారు చేసినట్టుగా నిర్ధారించుకున్నారు. అనంతరం ఆదివారం సాయంత్రం సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుబేదారి ఎస్సై శ్రీకాంత్ బీఎన్ఎస్ 318(4), 336(3) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)