తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siricilla Crime News : అనుమానంతో భార్యను చంపేసి...! ఆపై భర్త ఆత్మహత్య

Siricilla Crime News : అనుమానంతో భార్యను చంపేసి...! ఆపై భర్త ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

14 November 2024, 20:53 IST

google News
    • భార్యను చంపేసిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. భార్యపై అనుమానం  పెంచుకున్న భర్త.. భార్యను వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్ళి కర్రతో తలపై కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను చంపేసి ఆపై భర్త ఆత్మహత్య..!
భార్యను చంపేసి ఆపై భర్త ఆత్మహత్య..!

భార్యను చంపేసి ఆపై భర్త ఆత్మహత్య..!

ప్రేమించుకున్నారు. కడదాకా కలిసి ఉంటామని మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడిచి ఆలుమగలుగా మారారు. ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు. క్షణికావేశంతో భార్యను భర్త కర్రతో కొట్టి చంపాడు. ప్రాణంగా ప్రేమించిన భార్య ప్రాణం తీశానని ఆవేదనతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.

సిరిసిల్ల శాంతి నగర్ కు చెందిన ముద్దం వెంకటేష్ (40), వసంత (36) ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వారికి ఇద్దరు ఇంటర్ ఫస్టియర్ చదివే కూతురు వర్షిణి. 7వ తరగతి చదువుతున్న కొడుకు అజిత్ ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగించే వెంకటేష్ క్షణికావేశంతో చేసిన పనితో ఇద్దరి ప్రాణాలు పోయాయి. అనుమానం పెనుభూతమై కుటుంబ కలహాలతో రగిలిపోతున్న వెంకటేష్ భార్య వసంత ను వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్ళి కర్రతో తలపై కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. కళ్ళముందే భార్య ప్రాణాలు వదలడంతో భయంతో ఆందోళనకు గురైన వెంకటేష్ అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పొలం వద్దకు వెళ్ళి ప్రాణాలు వదిలి…

వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళిన దంపతులు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద విగతజీవులుగా పడి ఉన్నారు. వసంత తలపై గాయాలు.. వెంకటేష్ పక్కన పురుగుల మందు డబ్బా ఉండడంతో ముందుగా అనుమానాస్పద మృతిగా భావించారు. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారించారు. నిత్యం భార్య ఫోన్ లో బిజీగా ఉండడంతో అనుమానంతో కుటుంబ కలహాలు మొదలై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు.

మిన్నంటిన పిల్లల రోదనలు

మేమిద్దరం.. మాకు ఇద్దరు అన్నట్లు సాఫీగా సాగుతున్న కుటుంబంలో క్షణికావేశంతో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. అమ్మనాన్నల శవాలను చూసి బోరున విలపించారు. మీమేం పాపం చేశాం నాన్న... మమ్ములను వదిలి ఎలా వెళ్ళాలనిపించిందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లల రోదనలు... క్షణికావేశంలో పేరేంట్స్ తీసుకున్న నిర్ణయం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. హత్యా, ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు అనేక అనర్థాలకు దారి తీస్తుందని ఈ విషాదకర ఘటన నిదర్శనంగా నిలుస్తుందని పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం