CAT Orders on IAS: ఐఏఎస్‌ల అభ్యర్థన తిరస్కరించిన క్యాట్, అధికారుల్ని రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
16 October 2024, 9:58 IST
- CAT Orders on IAS: పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగించేలా ఉపశమనం కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. ఇంట్లో నుంచి పనిచేస్తామని కోరలేరంటూ అధికారులకు క్యాట్ చురకలు వేసింది. డీఓపీటీ ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేయడంతో తెలంగాణ అధికారుల్ని ప్రభుత్వం రిలీవ్ చేసింది.
తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
CAT Orders on IAS: పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగేలా డీఓపీటీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరిన తెలుగు రాష్ట్రాల ఐఏఎస్ అధికారులకు నిరాశ తప్పలేదు. ఏపీ తెలంగాణ క్యాడర్ అధికారులు డీఓపీటీ ఉతర్వులను పాటించాల్సిందేననంటూ, డీఓపీటీ ఉత్తర్వులపై జోక్యానికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ నిరాకరించింది.
కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆలిండియా సర్వీసు అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16లోగా చేరాల్సిందేనని హైదరాబాద్లోని కేంద్ర పరిపా లనా ట్రైబ్యునల్ బెంచ్ స్పష్టం చేసింది.
డీఓపీటీ గత వారం ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి క్యాట్ నిరాకరించింది. ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తు న్నామని పేర్కొంది. ఆలిండియా సర్వీస్ అధికారుల కేటాయింపుపై అధికారుల వ్యక్తి గత అభ్యర్ధనలను పరిశీలించి.. నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు గత జనవరిలో ఆదేశాలు ఇచ్చింది.
వ్యక్తిగత పిటిషన్లను విచారించిన డీఓపీటీ అధికారుల అభ్యర్ధనలను తిరస్కరిస్తూ.. గతంలో చేసిన కేటాయింపులనే ఖరారు చేస్తూ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ క్యాడర్ లో పనిచేస్తున్న ఆంధ్రాకు కేటాయించిన అధికారులు వాకాటి కరుణ, కె. ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్స్, ఏపీలో పనిచేస్తున్న జి.సృజన, హరికిరణ్, శివశంక ర్లు మరోసారి క్యాట్‌ను మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు.
మంగళవారం ఈ పిటిషన్లపై లతా బస్వరాజ్ పట్నే, శాలినీ మిశ్రాలతో కూడిన దర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఆలిండియా సర్వీసు అధికారుల విభజన, రాష్ట్రాల కేటాయింపులకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలు కొంత మందికి ఇబ్బంది కలిగించి ఉంటాయని అయితే సర్దుబాటు తప్పదని క్యాట్ స్పష్టం చేసింది.
పిటిషన్లపై విచారణను నవంబరుకు వాయిదా వేసింది. ఆలిండియా సర్వీసు ఉద్యోగులు అవసరమైతే దేశ సరిహద్దుల్లో పనిచేయడానికైనా సిద్ధంగా ఉండాలని, ఇంట్లో నుంచి పనిచేయడం కుదరదని క్యాట్ అసహనం వ్యక్తం చేసింది. విజయవాడలో వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజ లకు సేవలందించాలని ఎందుకు అనుకోవడం లేదని తెలంగాణలో ఉన్న అధికారుల్ని ప్రశ్నించింది.
ఏఐఎస్ అధికారుల కేటాయింపుల్లో పారదర్శకత లేదని, కొందరి పట్ల సానుకూలంగా వ్యవహరించడంతోనే పదేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉందని క్యాట్ అభిప్రాయపడింది. క్యాట్ తీర్పు నేపథ్యంలో తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, వాణిప్రసాద్, రొనాల్డ్ రాస్, ఆమ్ర పాలి బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నారు. మరోవైపు తెలంగాణ క్యాడర్ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 16లోగా ఎక్కడి వారక్కడ విధుల్లో చేరాలని డీఓపీటీ స్పష్టం చేసిన నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందనే కీలకం కానుంది.
గత ఏడాది జనవరిలో తెలంగాణ సోమేష్ కుమార్ సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పడంతో ఆయన ఏపీలో విధుల్లో చేరారు. ఆ తర్వాత ఎలాంటి పోస్టింగ్ తీసుకోకుండానే వీఆర్‌ఎస్ తీసుకున్నారు. అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా చేరారు. తాజాగా ఐఏఎస్‌లు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లమని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోర్టు ఎలా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది.